Teenager Hiding Things : టీనేజ్ పిల్లలు మీతో విషయాలు దాస్తున్నారా..? ఈ చిట్కాలతో వారి నమ్మకాన్ని గెలుచుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చిన్నతనంలో బడిలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని అమ్మానాన్నలతో పంచుకునే పిల్లలు, కౌమారదశలోకి (teenage) అడుగుపెట్టగానే ఒక్కసారిగా మారిపోతుంటారు. గది తలుపులు వేసుకోవడం, ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం, తల్లిదండ్రులు ఏదైనా అడిగితే పొడిపొడిగా సమాధానాలు చెప్పడం వంటి మార్పులు సహజంగా కనిపిస్తాయి. ఇది చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో దాస్తున్నారని, తప్పుదారి పడుతున్నారేమోనని ఆందోళన చెందుతుంటారు. అయితే, టీనేజ్ పిల్లలు అన్ని విషయాలు పంచుకోకపోవడం ఎల్లప్పుడూ తప్పు కాదని, అది వారిలో పెరుగుతున్న స్వతంత్ర భావాలకు, వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వారిని నియంత్రించాలని చూడటం కంటే, వారి నమ్మకాన్ని గెలుచుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

 ప్రతిదానికీ అనుమానించవద్దు..

పిల్లలు ప్రతి విషయాన్ని చెప్పకపోతే వారు ఏదో తప్పు చేస్తున్నారని ముద్ర వేయకండి. పదేపదే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తే వారు మీకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. వారికి కొంత వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వండి.

  కోపం వద్దు.. ప్రేమతో మాట్లాడండి..

తల్లిదండ్రులు తిడతారనో, శిక్షిస్తారనో భయపడే పిల్లలు నిజాలను దాస్తుంటారు. ఎలాంటి సమస్యనైనా నిర్భయంగా మీతో పంచుకోవచ్చనే భరోసాను వారిలో కల్పించండి.

  స్నేహితుల్లా మెలగండి..

ఎప్పుడూ చదువులు, మార్కులు, క్రమశిక్షణ గురించే కాకుండా వారి ఇష్టాయిష్టాలు, స్నేహితులు, క్రీడలు, సంగీతం వంటి విషయాలపై కూడా సరదాగా మాట్లాడండి. దీనివల్ల వారితో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.

 గోప్యతకు (privacy) గౌరవం ఇవ్వండి..

టీనేజ్ పిల్లలకు తమకంటూ కొంత ప్రైవసీ అవసరం. అనవసరంగా వారి ఫోన్లు తనిఖీ చేయడం, గదిలోకి తొంగి చూడటం వల్ల నమ్మకం దెబ్బతింటుంది. అయితే, ఏదైనా ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రం సున్నితంగా గమనిస్తూ ఉండాలి.

 సలహాల కంటే ముందు వారి మాట వినండి..

పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలోనే అడ్డుకుని సలహాలు ఇవ్వడం లేదా తీర్పులు చెప్పడం మానుకోండి. ముందుగా వారి భావాలను అర్థం చేసుకుని, వారు చెప్పేది పూర్తిగా వినండి.

 తప్పు చేసినా అండగా నిలవండి..

పిల్లలు తమ తప్పును అంగీకరించినప్పుడు అందరి ముందు అవమానించకండి. ఆ తప్పు వల్ల కలిగే పరిణామాలను వివరించి, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మార్గనిర్దేశం చేయండి. అప్పుడే భవిష్యత్తులోనూ వారు నిజం చెప్పడానికి ధైర్యం చేస్తారు.

 ప్రవర్తనలో మార్పులను గమనించండి..

పిల్లలు అకస్మాత్తుగా ఒంటరిగా ఉండటం, ఎప్పుడూ దిగులుగా కనిపించడం, చదువులో బాగా వెనుకబడటం లేదా తీవ్ర ఒత్తిడికి గురవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. వారితో ప్రేమగా మాట్లాడండి, అవసరమైతే మానసిక నిపుణులు లేదా కౌన్సెలర్ల సహాయం తీసుకోండి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.