PTSD Research : భయానక ఘటనలతో మెదడుపై చెరగని ముద్ర..! పీటీఎస్డీపై పరిశోధనలో కీలక అంశాలు..
సాక్షి లైఫ్ : జీవితంలో ఎదురయ్యే భయానక ప్రమాదాలు, తీవ్రమైన మానసిక ఆఘాతాలు కేవలం మనసునే కాదు, మెదడు నిర్మాణాన్ని కూడా లోతుగా ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. 'పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్' (PTSD) అనేది సాధారణ ఒత్తిడి కాదని, దీనివల్ల మెదడులో అణు, కణ స్థాయిలో స్పష్టమైన మార్పులు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ 'సెల్ రిపోర్ట్స్' జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
అసలేమిటీ పీటీఎస్డీ అంటే..?
ఏదైనా భయానక లేదా ప్రాణాపాయ ఘటనను ఎదుర్కొన్న తర్వాత, ఆ జ్ఞాపకాలు పదేపదే వెంటాడటం, పీడకలలు రావడం వంటి లక్షణాలతో కూడిన మానసిక సమస్యే పీటీఎస్డీ. ఈ సమస్య ఉన్నవారి మెదడులో 'డీఎన్ఏ మిథైలేషన్' అనే సహజ ప్రక్రియలో విభిన్నమైన మార్పులు కనిపిస్తాయి.
ఇది ఒక 'డిమ్మర్ స్విచ్' లాగా పనిచేసి, జన్యువుల చురుకుదనాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేయడం చేస్తుంది. ఈ మార్పులు వ్యక్తి లింగం, జాతితో పాటు ఆ మానసిక ఆఘాతం చిన్నతనంలో ఎదురైందా లేక పెద్దయ్యాక జరిగిందా అనే అంశాలపై ఆధారపడి ఉంటాయి.
302 మంది మెదడు నమూనాలపై విశ్లేషణ..
అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఫ్రాన్సిస్ షాంపైన్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. ఇందులో భాగంగా 302 మంది మరణానంతర మెదడు నమూనాలను (101 మంది పీటీఎస్డీ బాధితులు, 101 మంది తీవ్రమైన కుంగుబాటు బాధితులు, 100 మంది మానసిక సమస్యలు లేనివారిని పరిశీ లించారు. ముఖ్యంగా వీరి మెదడులోని మూడు కీలక భాగాలను విశ్లేషించారు.
ప్రీఫ్రంటల్ కార్టెక్స్..నిర్ణయాలు తీసుకోవడం వంటి ఉన్నతస్థాయి పనులను నియంత్రిస్తుంది.
అమిగ్డాలా..భావోద్వేగాలను నియంత్రించే కేంద్రం.
హిప్పోక్యాంపస్.. జ్ఞాపకశక్తిని నిర్వహించే భాగం.
పరిశోధనలో తేలిన కీలక అంశాలు..
తీవ్రమైన కుంగుబాటు (depression) ఉన్నవారితో పోలిస్తే, పీటీఎస్డీ బాధితుల మెదడులోని వివిధ భాగాల్లో డీఎన్ఏ మిథైలేషన్ తీరులో ఎక్కువ వైవిధ్యం కనిపించింది.
పీటీఎస్డీ బాధితుల్లో ముఖ్యంగా 'ప్రీఫ్రంటల్ కార్టెక్స్' భాగంలో ఈ మార్పులు స్పష్టంగా ఉండగా, కుంగుబాటు బాధితుల్లో 'అమిగ్డాలా' భాగంలో మార్పులు కనిపించాయి.
పెద్దయ్యాక తీవ్రమైన మానసిక ఆఘాతానికి గురైన పీటీఎస్డీ బాధితుల అమిగ్డాలాలో 'ఒలిగోడెండ్రోసైట్స్' అనే కణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇవి నాడీ కణాల (nerve cells) చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తాయి.
భవిష్యత్తులో మెరుగైన చికిత్సకు బాటలు..
పీటీఎస్డీ బాధితుల మెదడులో జరిగే ఈ ప్రత్యేక మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా, భవిష్యత్తులో వారికి మరింత మెరుగైన, వ్యక్తిగత చికిత్స (personalized treatment) అందించేందుకు వీలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఇది మరణానంతర కణజాలంపై చేసిన అధ్యయనం కావడంతో, ఈ మార్పులే పీటీఎస్డీకి నేరుగా కారణమయ్యాయా అనేది పూర్తిగా నిర్ధారించలేకపోయామని, రోగుల లక్షణాల తీవ్రతపై పూర్తి వివరాలు లేకపోవడం ఒక పరిమితి అని వారు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
