Sudden Heart Attacks : సడెన్ హార్ట్ ఎటాక్స్‌కు అసలు కారణం ఆ జన్యువులే.. సీసీఎంబీ తాజా రిపోర్ట్..!
సాక్షి లైఫ్ : గుండె కండరాలు అసాధారణంగా మందం ఎక్కే 'హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (Hypertrophic Cardiomyopathy - HCM)' వ్యాధికి సంబంధించి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ వ్యాధికి కారణమయ్యే రెండు అరుదైన జన్యు మార్పులను వారు గుర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ (OU), ఏఐజీ (AIG) ఆసుపత్రులతో కలిసి సీసీఎంబీ ఈ పరిశోధనను నిర్వహించింది. ఈ అధ్యయన వివరాలు 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ: ఆసియా' నవంబర్ సంచికలో ప్రచురితమయ్యాయి.
MYH7 జన్యువులో మార్పులే కారణం..
గుండె కండరాలు సంకోచించేందుకు అవసరమైన ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడంలో 'MYH7' అనే జన్యువు కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ జన్యువులో ఇంతకు ముందెన్నడూ నమోదుకాని రెండు అరుదైన మార్పులను పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా తెలంగాణకు చెందిన 160 మంది హెచ్‌సీఎం (HCM) రోగులు, 178 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల జన్యువులను విశ్లేషించారు. ఇందులో మొత్తం 34 జన్యు మార్పులను గుర్తించగా.. అందులో మయోసిన్ ప్రోటీన్ పనితీరుపై ప్రభావం చూపే రెండు మార్పులు అత్యంత కీలకమైనవని తేల్చారు.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
రెండు వేరియంట్స్ ..
ఈ రెండు జన్యు వేరియంట్లను (p.Met684Arg, p.Leu725Pro) రెండు వేర్వేరు కుటుంబాల్లో గుర్తించారు.. మొదటి కేసులో 52 ఏళ్ల మహిళ గుండె కండరాలు తీవ్రంగా మందం ఎక్కగా, అదే వేరియంట్ ఉన్న ఆమె 26 ఏళ్ల కుమారుడిలో ఆ సమస్య స్వల్పంగా ఉంది. రెండవ కేసులో సడెన్ కార్డియాక్ డెత్ (sudden cardiac death) చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండగా, ఆయన 24 ఏళ్ల కుమార్తెలో అవే లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. వయసును బట్టి ఈ జన్యువు ప్రభావం వేర్వేరుగా ఉంటుందని పరిశోధనలో తేలింది.
ముందే గుర్తిస్తే మేలు..
ఈ అరుదైన జన్యు మార్పులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారతదేశం లేదా దక్షిణాసియా జనాభాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ దీపా సెల్వి రాణి, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ వివరించారు. ముఖ్యంగా గుండె జబ్బుల చరిత్ర ఉన్న కుటుంబాల్లో ఈ తరహా జన్యు మార్పులను ముందుగానే గుర్తించడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే సమర్థవంతంగా అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
