Protein Deficiency in Women : రెడీ టు ఈట్ పై మోజుతో మహిళలకు ప్రొటీన్ లోపం..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితం.. వెరసి మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఇంటి భోజనం కన్నా బయట దొరికే 'రెడీ టు ఈట్' (ready to eat) ఆహారానికే జనం మొగ్గుచూపుతున్నారు. ఇందులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఎస్బీఐ (SBI) తాజా పరిశోధనలో వెల్లడైంది. మరోవైపు, మహిళల్లో ప్రొటీన్ (protein deficiency) లోపం తీవ్రంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
రెడీ టు ఈట్ పైనే ఎక్కువ ఖర్చు..
నెలవారీ ఆహార ఖర్చుల విషయంలో దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. అయితే, వండిన లేదా ప్యాకేజ్డ్ రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై చేసే ఖర్చులో మాత్రం తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆహారం కోసం చేసే మొత్తం ఖర్చులో 16.3 శాతం దీనికే వెచ్చిస్తున్నారు. మన తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.
మహిళల పళ్లెంలో ప్రొటీన్ ఏదీ..?
ఆహారంలో మాంసకృత్తుల వినియోగం విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) డేటా ఆధారంగా ఎస్బీఐ చేసిన విశ్లేషణ ప్రకారం ఈ కింది విషయాలు వెల్లడయ్యాయి.
3 నుంచి 4 రకాల ప్రొటీన్ ఆధారిత ఆహారాలను తీసుకుంటున్న పురుషులు 91 శాతం ఉంటే, మహిళలు కేవలం 61 శాతం మాత్రమే ఉన్నారు.
పాలు, పెరుగు వాడకంలో పురుషులు 91.3 శాతం ఉంటే, మహిళలు 86.2 శాతం ఉన్నారు.
గుడ్లు తినే పురుషులు 80.2 శాతం కాగా, మహిళలు 76.7 శాతంగా నమోదయ్యారు.
చేపల వినియోగంలో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. 32.7 శాతం పురుషులు చేపలు తింటుంటే, కేవలం 18.6 శాతం మహిళలు మాత్రమే వీటిని తీసుకుంటున్నారు.
మహిళలు తమ సొంత పోషకాహారం కంటే కుటుంబ సభ్యుల ఇష్టాలకే పెద్దపీట వేయడం, పురుషులు బయట ఎక్కువగా మాంసాహారం తినడం తదితర కారణాల వల్లే ఈ వ్యత్యాసం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రొటీన్ తగ్గితే ముప్పే..
శరీరంలో మాంసకృత్తుల లోపం వల్ల కండరాలు క్షీణించడం, నీరసం, అలసట, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయని ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ విద్యా టికూ హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), జాతీయ పోషకాహార సంస్థ (NIN) సూచనల ప్రకారం.. ప్రతి వ్యక్తి తమ శరీర బరువులో కిలోకు 0.8 గ్రాముల చొప్పున ప్రొటీన్ తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం.. ముఖ్యంగా ఇంటికి దీపమైన మహిళలు తమ ఆహారం విషయంలో, ప్రొటీన్ల విషయంలో రాజీ పడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
