మండే ఎండల్లో చల్లటి నీరు తాగుతున్నారా..?
సాక్షి లైఫ్: ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో చాలామంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీరు తాగుతుంటారు. కానీ మీకు తెలుసా..? చల్లని నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని. చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీని ప్రభావంతో జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. అంతేకాదు మండే వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థ పై తీవ్ర ప్రభావం..
జీర్ణవ్యవస్థ పై తీవ్రప్రభావం పడుతుంది. చల్లటి నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా ఎసిడిటీ, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
తలనొప్పి..
ఎక్కువ సార్లు చల్లటి నీరు తాగడం వల్ల తలనొప్పి వస్తుంది. చల్లటి నీరు తాగడం వల్ల తలలోని నరాలపై ప్రభావం చూపుతుంది. అప్పుడు అవి సరిగ్గా పనిచేయవు. దీనివల్ల సైనస్ సమస్యలు కూడా తలెత్తుతాయి.
శక్తి తగ్గుతుంది..
చల్లటి నీరు అతిగా తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు మందగిస్తాయి. దీని వల్ల శరీరం సరిగా పనిచేయదు. దీని కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
మలబద్ధక సమస్య..
రిఫ్రిజిరేటర్ నుంచి చల్లటి నీటిని తాగడం వల్ల కూడా మలబద్ధక సమస్య తలెత్తుతుంది. ఇప్పటికే మలబద్ధకం సమస్య ఉన్నవారు చల్లటి నీరు తాగకూడదని వైద్యనిపుణులు అంటున్నారు. నిజానికి చల్లటి నీరు తాగడం వల్ల మలం గట్టిపడుతుంది. దీనివల్ల మలబద్ధక సమస్య వస్తుంది. ఇప్పటికే ఈ సమస్య ఉంటే, చల్లని నీరుతాగకపోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
గొంతు నొప్పి..
చల్లని నీరు తాగడం వల్ల గొంతు సమస్యలు వస్తాయి. ఇది గొంతు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది, దీని కారణంగా కఫం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నసమయంలో చల్లని నీళ్లే కాదు.. కూల్ డ్రింక్స్ కూడా అతిగా తాగకూడదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
హార్ట్ రేట్..
హృదయ స్పందన తగ్గుతుంది. మానవ శరీర ఉష్ణోగ్రత సహజంగానే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో రక్త ప్రసరణ కొనసాగుతుంది కాబట్టి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం పడి, ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. కొన్నిసార్లు చల్లటి నీటిని నిరంతరం తాగడం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి అలవాట్లు గుండె ఆరోగ్యానికి హానికరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
