Drinking Too Much Water : అతిగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి చేటేనా..?
సాక్షి లైఫ్ : ఎండాకాలం రాగానే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు అందరూ ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న ఉద్దేశంతో, దాహం వేసినా వేయకపోయినా పదేపదే మంచినీళ్ల సీసాను ఖాళీ చేస్తుంటారు. అయితే, ఆరోగ్యానికి ఎంత అవసరమో అంతే తాగాలి, మితిమీరితే ఆ నీరే అనారోగ్యానికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. మరీ ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టే వాతావరణంలో శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాలి. అతిగా నీళ్లు తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఓవర్హైడ్రేషన్ (Overhydration) అంటే ఏమిటి..?
శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా నీరు త్రాగినప్పుడు, రక్తంలో సోడియం (ఉప్పు) స్థాయిలు పలచబడిపోతాయి. వైద్య పరిభాషలో ఈ స్థితిని 'హైపోనట్రీమియా' (Hyponatremia) అని పిలుస్తారు. దీనివల్ల శరీరంలోని కణాల్లో వాపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ వాపు మెదడు కణాలకు వ్యాపించి ప్రాణాపాయ స్థితికి దారితీసే ప్రమాదం ఉంది.
ఓవర్హైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
మీరు మోతాదుకు మించి నీరు తాగుతున్నారని సూచించే కొన్ని ప్రధాన లక్షణాలు..
వికారం, వాంతులు కావడం, తీవ్రమైన తలనొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపించడం, శరీరం నీరసించిపోవడం, కండరాలు పట్టేయడం, కళ్లు తిరగడం, ఏకాగ్రత లోపించడం లేదా గందరగోళానికి గురికావడం, పరిస్థితి విషమిస్తే మూర్ఛ రావడం (Seizures) లేదా అపస్మారక స్థితి అంటే కోమాలోకి వెళ్లిపోవడం జరుగుతుంది.
రోజుకు ఎంత నీరు తాగాలి..? ఎలా గుర్తించాలి..?
ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఇన్ని లీటర్ల నీరే తాగాలనే నియమం ఉండదు. వయసు, బరువు, మీరు చేసే శారీరక శ్రమ, వాతావరణ పరిస్థితులు, మీ ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా నీటి అవసరం మారుతూ ఉంటుంది. దాహమే సరైన కొలమానం..దాహం వేసినప్పుడు నీరు తాగడం ఉత్తమమైన మార్గం. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి.
మూత్రం రంగు..
మీ శరీరం సరైన హైడ్రేషన్ తో ఉందో లేదో తెలుసుకోవడానికి మూత్రం రంగు సులభమైన సూచిక. మూత్రం లేత పసుపు రంగులో వస్తుంటే మీ శరీరానికి తగినంత నీరు అందుతున్నట్లేనని గుర్తించాలి. మరీ నీళ్లలా తెల్లగా వస్తుంటే మీరు అతిగా తాగుతున్నట్లు లెక్క. ఎండాకాలంలో లేదా వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఒకేసారి లీటర్ల కొద్దీ నీళ్లు గటగటా తాగేయకుండా.. కొద్దికొద్దిగా, నెమ్మదిగా తాగాలి.
ఎక్కువసేపు వ్యాయామం చేసేవారు లేదా కఠినమైన కాయకష్టం చేసేవారు చెమట రూపంలో సోడియంను కోల్పోతారు. కాబట్టి వారు కేవలం సాధారణ నీళ్లే కాకుండా ఎలక్ట్రోలైట్స్ అంటే కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, నిమ్మరసం లాంటివి తీసుకోవడం ద్వారా శరీరంలో లవణాల సమతుల్యతను కాపాడుకోవచ్చు. 'అతి సర్వత్ర వర్జయేత్' అనే నానుడి నీటికి కూడా వర్తిస్తుంది. దాహార్తిని తీర్చుకునేందుకు నీరు తాగాలి కానీ, బలవంతంగా కాదు. సరైన మోతాదులో నీరు తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు సాగుదాం..!
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
