Constipation Trouble : మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ అలవాట్లు మార్చుకుంటే ఉదయాన్నే కడుపు సాఫీగా..
సాక్షి లైఫ్ : ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి గంటల తరబడి బాత్రూమ్లో కూర్చున్నా ప్రయోజనం ఉండటం లేదు. మలబద్ధకం (Constipation) కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు రోజంతా వేధిస్తుంటాయి. అయితే, మన రోజువారీ దినచర్యలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
విసర్జనను వాయిదా వేయొద్దు..
ఉదయం లేవగానే మలవిసర్జనకు వెళ్లాలనిపిస్తే.. ఏ పనిలో ఉన్నా దాన్ని వాయిదా వేయకూడదు. ఇలా పదే పదే చేయడం వల్ల శరీరంలోని సహజ సిద్ధమైన ప్రక్రియ దెబ్బతింటుంది. ప్రతిరోజూ ఉదయం ఒకే సమయానికి బాత్రూమ్కు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. శరీర సంకేతాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
నిద్రలేవగానే నీళ్లు తాగాలి..
మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని లేదా సాధారణ నీటిని తాగడం దినచర్యలో భాగం చేసుకోవాలి. శరీరంలో సరిపడా నీరు (hydration) ఉంటేనే మలం మృదువుగా మారి సాఫీగా బయటకు వస్తుంది. ఫైబర్ ఫుడ్ తీసుకునేటప్పుడు తగినంత నీరు తాగకపోతే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఆహారంలో పీచు తప్పనిసరి..
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో పీచుపదార్థాలు (Fiber) తగినంత ఉండాలి. ఇందుకోసం మీ రోజువారీ డైట్లో ఈ క్రింది వాటిని చేర్చుకోండి..
పండ్లు..బొప్పాయి, జామ, ఆపిల్, పియర్స్ .
కూరగాయలు..పాలకూర వంటి ఆకుకూరలు, క్యారెట్, బఠానీలు.
చిరుధాన్యాలు..ఓట్స్, దాలియా, పొట్టుతీయని ధాన్యాలు.
పప్పులు..శనగలు, రాజ్మా, పెసలు.గమనిక: ఫైబర్ శాతాన్ని డైట్లో ఒకేసారి కాకుండా క్రమంగా పెంచుకుంటూ.. దానికి తగ్గట్లుగా నీళ్లు తాగాలి. లేదంటే గ్యాస్ సమస్య రావచ్చు.
మార్నింగ్ వాక్..
శారీరక శ్రమ లేకపోవడం కూడా మలబద్ధకానికి ప్రధాన కారణం. ఉదయం పూట కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. మీ వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోండి.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?
కొన్నిరోజులు ఈ జాగ్రత్తలు పాటించినా మలబద్ధకం తగ్గకపోయినా.. లేదా మలంలో రక్తం పడటం, విపరీతమైన కడుపునొప్పి, వాంతులు, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ సలహా లేకుండా మలబద్ధకాన్ని తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు సొంతంగా వాడకూడదు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
