Sleep with Earbuds : ఇయర్‌బడ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా..? ఐతే ఈ ముప్పు తప్పదు..!
సాక్షి లైఫ్ : రోజంతా పడిన అలసట మాయమై, హాయిగా నిద్రపట్టాలని చాలామంది రాత్రి పడుకునేటప్పుడు ఇష్టమైన పాటలో, ప్రవచనానలో, పాడ్‌కాస్ట్‌లో వింటుంటారు. నెమ్మదిగా వస్తున్న సంగీతం వింటుంటే ఒత్తిడి తగ్గి త్వరగా నిద్ర పడుతుందని భావిస్తుంటారు. అయితే, రాత్రంతా ఇయర్‌బడ్స్ (Earbuds) చెవిలోనే ఉంచుకుని నిద్రపోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరిగేటప్పుడు కూడా వీటిని తీయకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
చెవిలో నొప్పి, ఒత్తిడి..
నిద్రపోతున్నప్పుడు ఇయర్‌బడ్స్ కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల అవి చెవి లోపలి, వెలుపలి భాగాలపై ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా పక్కకు తిరిగి పడుకున్నప్పుడు దిండుకు, చెవికి మధ్య ఇయర్‌బడ్ నొక్కుకుపోయి తీవ్రమైన నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. రోజూ ఇలా జరిగితే చర్మం కందిపోవడం, చెవి నరాలు మరింత సున్నితంగా మారి నొప్పి శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది.
పెరిగే ఇన్ఫెక్షన్ల ముప్పు..
రాత్రంతా ఇయర్‌బడ్స్ పెట్టుకోవడం వల్ల చెవిలోకి గాలి స్వేచ్ఛగా వెళ్లదు. దీనివల్ల చెవిలో తేమ, మురికి చేరి బ్యాక్టీరియా లేదా ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. శుభ్రం చేయని బడ్స్ వాడటం, ఒకరివి మరొకరు పెట్టుకోవడం వల్ల కూడా చెవిలో దురద, మంట వస్తాయి. కనుక చెవిలో బడ్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు.
వినికిడి శక్తికి ప్రమాదం..
గంటల తరబడి, ఎక్కువ శబ్దంతో పాటలు వినడం వల్ల వినికిడి శక్తి (Hearing loss) దెబ్బతింటుంది. తక్కువ శబ్దంతో విన్నా సరే, రాత్రంతా చెవిలో శబ్దం మోగుతూనే ఉండటం కర్ణభేరికి ఏమాత్రం మంచిది కాదు.
నిద్ర నాణ్యత..
మ్యూజిక్ వినడం వల్ల మొదట్లో త్వరగా నిద్ర పట్టినప్పటికీ.. రాత్రంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్ ప్లే అవుతూనే ఉంటే మెదడు విశ్రాంతి తీసుకోలేదు. దీనివల్ల గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. మధ్యమధ్యలో మెలకువ రావడం వల్ల ఉదయం నిద్రలేవగానే అలసటగా, నీరసంగా అనిపిస్తుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు..
పాటలు వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే మొబైల్ లేదా మ్యూజిక్ యాప్‌లో 'స్లీప్ టైమర్' (Sleep Timer) సెట్ చేసుకోండి. దీనివల్ల కాసేపటికి పాటలు వాటంతట అవే ఆగిపోతాయి. ఇయర్‌బడ్స్‌కు బదులుగా బ్లూటూత్ స్పీకర్‌ను తక్కువ శబ్దంతో పెట్టుకుని వినడం ఎంతో శ్రేయస్కరం.
ఎప్పటికప్పుడు ఇయర్‌బడ్స్‌ను శుభ్రం చేసుకోవాలి. ఒకరు వాడినవి మరొకరు వాడకూడదు. చెవిలో నొప్పి, దురద, వాపు లేదా ఏదైనా ద్రవం కారుతున్నట్లు అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈఎన్టీ (ENT) వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం, ఇయర్ బడ్స్‌తో చెవిని శుభ్రం చేయడం లాంటివి చేయకూడదు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
