Essential Nutrients : వయసు పైబడుతోందా..? కడుపు నిండితే సరిపోదు.. డైట్‌లో ఈ పోషకాలు తప్పనిసరి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. జీర్ణక్రియ మందగించడం, ఆకలి తగ్గడం, ఎముకలు, కండరాలు బలహీనపడటం సహజంగా జరిగే పరిణామాలు. ఈ దశలో కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే ఏదో ఒకటి తినకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, రోజువారీ పనులు చురుగ్గా చేసుకోవడానికి వృద్ధుల రోజువారీ డైట్‌లో ఎలాంటి పోషకాలు తప్పనిసరిగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

కండరాల బలానికి 'ప్రొటీన్'..

వయసు పెరిగే కొద్దీ కండరాల క్షీణత ఎక్కువగా ఉంటుంది. దీన్ని అడ్డుకుని, కండరాలను బలంగా ఉంచడంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పప్పులు, పాలు, పెరుగు, పన్నీర్, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్న వృద్ధులు మాత్రం వైద్యుల సలహా మేరకే ప్రొటీన్ మోతాదును నిర్ణయించుకోవాలి.

ఎముకల దృఢత్వానికి 'క్యాల్షియం, విటమిన్-డి'..

వయసు పైబడిన వారిలో ఎముకల సాంద్రత తగ్గిపోయి, సులువుగా విరిగే ప్రమాదం (fractures) ఉంటుంది. ఎముకలు, దంతాల గట్టితనానికి క్యాల్షియం అత్యవసరం. పాలు, పాల పదార్థాలు, ఆకుకూరల ద్వారా ఇది లభిస్తుంది. అయితే, తీసుకున్న క్యాల్షియం శరీరానికి వంటబట్టాలంటే 'విటమిన్-డి' తప్పనిసరి. ఉదయం ఎండలో కాసేపు కూర్చోవడం, అవసరమైతే వైద్యుల సూచనతో సప్లిమెంట్లు వాడటం ద్వారా విటమిన్-డి లోపాన్ని నివారించవచ్చు.

నరాలు, రక్తవృద్ధికి 'విటమిన్ బి12, ఐరన్'..

వృద్ధాప్యంలో తీసుకునే ఆహారం నుంచి విటమిన్ బి12(Vitamin B12)ను గ్రహించే సామర్థ్యాన్ని శరీరం కోల్పోతుంటుంది. దీని లోపం వల్ల విపరీతమైన నీరసం, రక్తహీనత, నరాల బలహీనత వస్తాయి. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసం ద్వారా ఇది లభిస్తుంది. పూర్తిగా శాకాహారం తినేవారు వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం. ఇక రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పప్పులు ఆహారంలో చేర్చుకోవాలి.

సాఫీగా జీర్ణక్రియకు 'ఫైబర్, నీరు'..

వృద్ధులను ఎక్కువగా వేధించే సమస్య మలబద్ధకం. శారీరక శ్రమ తగ్గడం, తగినంత నీరు తాగకపోవడం, కొన్ని రకాల మందుల వాడకం దీనికి కారణం కావచ్చు. పీచు పదార్థాలు (fiber) ఎక్కువగా ఉండే పొట్టుతీయని తృణధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, బీన్స్ తీసుకోవాలి. దీనికి తోడు రోజంతా తగినంత నీరు తాగడం వల్ల మలబద్ధకం దూరమై, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.