Hair care : జుట్టుకు రాత్రంతా నూనె రాసి ఉంచుతున్నారా..? డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..?
సాక్షి లైఫ్ : కురులు ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా పెరగాలంటే రాత్రంతా తలకు నూనె రాసి ఉంచాలని మన పెద్దలు చెబుతుంటారు. తరాల నాటి ఈ అలవాటును నేటికీ చాలా మంది పాటిస్తున్నారు. అయితే, నేటి మారుతున్న జీవనశైలి, విపరీతమైన కాలుష్యం, జుట్టు సమస్యల నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ రాత్రంతా తలకు నూనె ఉంచుకోవడం సరైనదేనా? దీనిపై చర్మవ్యాధి నిపుణులు (Dermatologists) ఏం సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
అసలు జుట్టుకు నూనె ఎందుకు రాయాలి..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టుకు నూనె రాయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కురులను మృదువుగా మార్చడం, పొడిదనాన్ని దూరం చేయడం. నూనె జుట్టుపై ఒక రక్షణ పొరలా ఏర్పడి, తలలోని సహజ తేమను లాక్ చేస్తుంది. తద్వారా జుట్టు చిట్లిపోవడం, రాలడం తగ్గుతాయి. ముఖ్యంగా కొబ్బరినూనె జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోయి, సహజ సిద్ధమైన కండీషనర్‌గా అద్భుతంగా పనిచేస్తుంది.
రాత్రంతా ఉంచడం అవసరమా..?
అస్సలు అవసరం లేదు! చాలా మందికి తలస్నానం చేయడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు తలకు తేలికపాటి నూనె రాసుకుంటే సరిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందు కంటే, ఎక్కువ సమయం లేదా రాత్రంతా తలపై నూనెను అలాగే ఉంచడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి, చెమట తలకు సులభంగా ఆకర్షితమవుతాయి. ఈ మురికి తల చర్మంపై పేరుకుపోయి ఇన్ఫెక్షన్లు, చర్మ చికాకులకు దారితీసే ప్రమాదం ఉంది.
రాత్రంతా నూనె పెట్టకూడని వారు ఎవరు..?
అందరి చర్మతత్వం ఒకేలా ఉండదు. ముఖ్యంగా కొన్నిరకాల సమస్యలు ఉన్నవారు రాత్రంతా నూనె ఉంచుకోకపోవడమే మంచిది. ఇప్పటికే సహజంగానే తల చర్మం జిడ్డుగా ఉన్నవారు. చుండ్రు, మొటిమలు: తలలో చుండ్రు, విపరీతమైన దురద లేదా కురుపులు, మొటిమలు ఉన్నవారు. సెబోర్హెయిక్ డెర్మటైటిస్: ఈ రకమైన చర్మ సమస్య ఉన్న రోగులు. అధిక తేమ, ఎక్కువ సమయం పాటు ఉండే నూనె తల చర్మంపై ‘ఫంగస్’ వృద్ధి చెందడానికి, వాపు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వీరు నూనెను ఎక్కువ సేపు ఉంచకూడదు.
పొడి జుట్టు ఉన్నవారు ఏం చేయాలి..?
ఎవరికైతే తల చర్మం, జుట్టు విపరీతంగా పొడిబారిపోతుందో.. వారు అప్పుడప్పుడు రాత్రంతా నూనె రాసుకోవచ్చు. అయితే, మరుసటి రోజు ఉదయం తల చర్మంపై అదనపు జిడ్డు పేరుకుపోకుండా ఉండటానికి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయడం తప్పనిసరి.
నూనె రాసే సరైన పద్ధతి..
జుట్టు ఆరోగ్యానికి నూనె ఎంత ముఖ్యమో.. దానిని రాసే విధానం కూడా అంతే కీలకం. ఎల్లప్పుడూ గోరువెచ్చని నూనెను మాత్రమే ఎంచుకోవాలి. వేలి కొనలతో తల చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, జుట్టు మరింత రాలే ప్రమాదం ఉంది.జుట్టు పొడవును బట్టి తగినంత పరిమాణంలోనే నూనె వాడాలి. ప్రతిరోజూ లేదా అమితంగా నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు.
నూనె రాసుకున్న తర్వాత తల భారంగా అనిపించినా, దురద లేదా జిగటగా మారినా ఆ పద్ధతి మీ చర్మానికి పడటం లేదని అర్థం. ఇటువంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, మీ చర్మతత్వానికి సరిపోయే సూచనలు పొందడం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
