Roti effect : రోటీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? నిపుణులు ఏమంటున్నారంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే చాలామంది ముందుగా చేసే పని అన్నం మానేసి రోటీలు తినడం. అన్నం తింటే బానపొట్ట వస్తుందని, చపాతీలు తింటే వేగంగా సన్నబడతారని ఒక బలమైన నమ్మకం సమాజంలో ఉంది. మరికొందరైతే అన్నం, రోటీ రెండింటినీ పక్కనపెట్టి కేవలం చిరుధాన్యాలకే (millets) పరిమితమవుతుంటారు. అయితే నిజానికి అన్నం వల్ల మాత్రమే బరువు పెరుగుతారా..? రోటీ తింటే నిజంగానే బరువు తగ్గుతారా..? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం..

శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనేవి ఒక్క ఆహార పదార్థంపైనే ఆధారపడి ఉండవు. తీసుకునే పరిమాణం, రోజువారీ శారీరక శ్రమ, కండరాల పుష్టి, ఇన్సులిన్ స్పందన వంటి అనేక అంశాలు బరువు పెరగడం లేదా తగ్గడాన్ని శాసిస్తాయి.

అన్నం vs రోటీ..పోషకాల పరంగా తేడా ఎంత..?

కేలరీల పరంగా చూస్తే ఒక చిన్న కప్పు వండిన అన్నంలోనూ, ఒక మధ్యస్థ గోధుమ రోటీలోనూ దాదాపు ఒకే పరిమాణంలో సుమారు 70 నుంచి 100 కేలరీలు శక్తి లభిస్తుంది. 

పీచు పదార్థం (Fiber).. తెల్ల అన్నంతో పోలిస్తే గోధుమ రోటీలో ఫైబర్ కాస్త ఎక్కువ. దీనివల్ల కడుపు త్వరగా నిండిన భావన కలిగి, ఎక్కువసేపు ఆకలి వేయదు.

జీర్ణక్రియ (Digestion).. అన్నం తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది. అయితే ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం వల్ల రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరుగుతుంది. 

బరువును ప్రభావితం చేసే అంశాలు..

1. ప్లేట్‌లో పరిమాణమే అసలు ముఖ్యం (Portion Size)..అన్నం లేదా రోటీ ఏదైనా సరే.. ఎంత పరిమాణంలో తింటున్నారనేదే ముఖ్యం. తక్కువ అన్నంతో ఎక్కువ పప్పు, కూరగాయలు తినడం వల్ల బరువు పెరగరు. కానీ చపాతీలు మంచివని చెప్పి ఒకేసారి నూనె లేదా నెయ్యి రాసిన నాలుగైదు రోటీలు తింటే కేలరీలు అమాంతం పెరిగిపోతాయి.

2. సమతుల్య భోజనమే శ్రీరామరక్ష..కేవలం పిండి పదార్థాలు..(carbohydrates)..మాత్రమే ఉండేలా కాకుండా, ప్లేట్‌లో ప్రోటీన్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అన్నమైనా, రోటీ అయినా సరే.. దానికి తగినంత పప్పు, ఆకుకూరలు, పెరుగు, పన్నీర్ లేదా గుడ్లు వంటి ప్రొటీన్ వనరులను తోడు చేసుకోవాలి.

3. బియ్యం రకం, వండే పద్ధతి...అన్ని రకాల బియ్యం ఒకేలా ప్రభావం చూపవు. ఎక్కువగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే ముడి బియ్యం (brown rice), సింగిల్ పాలిష్ బియ్యం, చేతిదంపుడు బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి.

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

4. మిల్లెట్స్ కూడా మ్యాజిక్ చేయలేవు..! జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో పోషకాలు, పీచు అధికంగా ఉంటాయన్నది నిజమే. అయితే వీటిని కూడా అధిక మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఏ ధాన్యమైనా శరీరానికి అవసరమైన మేరకే తీసుకోవాలి.

5. శారీరక శ్రమ తప్పనిసరిఆహారంలో కార్బోహైడ్రేట్లు(carbohydrates) తీసుకున్నప్పుడు ఆ శక్తి ఖర్చు కావడానికి తగిన శారీరక శ్రమ ఉండాలి. రోజంతా కదలకుండా కూర్చుని పనిచేసే వారు తీసుకునే కేలరీలను ఖర్చు చేయకపోతే, అది కొవ్వు రూపంలో నిల్వ చేరుతుంది. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల నడక లేదా కసరత్తులు జీవక్రియను చురుగ్గా ఉంచుతాయి. 

అన్నం పూర్తిగా మానేయాలా..? ఖచ్చితంగా అవసరం లేదు..! 

బరువు తగ్గడానికి అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన పనిలేదు. ప్లేట్‌లో సగం భాగం కూరగాయలు, పావు భాగం ప్రొటీన్ అంటే పప్పు,గుడ్డు,పన్నీర్, మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా రోటీ ఉండేలా చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ లక్షణాలు..?

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.