Dry Fruits : డ్రై ఫ్రూట్స్‌తో బోలెడు బలం.. అతిగా తింటే ముప్పు తప్పదు..!
సాక్షి లైఫ్ : శరీరం ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరి. రోజువారీ భోజనంలో ఆకుకూరలు, తాజా పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం (fiber) పుష్కలంగా అందుతాయి. బాదం, వాల్నట్స్, జీడిపప్పు, కిస్మిస్, అంజీర్ వంటివి శరీరానికి తక్షణ శక్తిని అందించే పోషకాల గనులుగా పేరుగాంచాయి. అయితే, ఆరోగ్యానికి మంచివి కదా అని వీటిని పరిమితికి మించి తింటే మాత్రం లాభం కంటే నష్టమే ఎక్కువని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల..
Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?
Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
శరీరానికి పోషకాల కవచం..
ఎండు ఫలాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరాన్ని అనేక వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. కంటి ఆరోగ్యానికి రక్ష.. కొన్ని రకాల ఎండు ఫలాల్లో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, వయసు పెరిగేకొద్దీ వచ్చే కంటి సమస్యల ముప్పును తగ్గిస్తాయి.
ఎముకలు, దంతాలకు పటిష్ఠత..వీటిలో క్యాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. నిత్యం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు దరిచేరవు.
రక్తహీనతకు చెక్.. కిస్మిస్, ఆప్రికాట్ వంటి వాటిలో ఐరన్ (iron) సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులకు ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
పరిమితి దాటితే అనర్థాలే..!
డ్రై ఫ్రూట్స్ పోషకాలను అందించినప్పటికీ, వీటిలో క్యాలరీలు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అతిగా తింటే కింది సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
మధుమేహులకు హెచ్చరిక..కిస్మిస్, అంజీర్, ఆప్రికాట్ వంటి వాటిలో సహజ చక్కెర శాతం అధికం. వీటిని ఎక్కువగా తింటే మధుమేహం (diabetes) ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. బాదం, జీడిపప్పు, అక్రోటులలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు క్యాలరీలు కూడా ఎక్కువే. లెక్కలేకుండా తింటే రోజువారీ క్యాలరీల పరిమితి దాటిపోయి, ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
ఎండు ఫలాల్లో పీచు పదార్థం (fiber) ఎక్కువ. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఫైబర్ అందడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో నొప్పి, పట్టేసినట్లు అనిపించడం వంటి జీర్ణ సమస్యలు వేధిస్తాయి. కిస్మిస్, అంజీర్ వంటివి కొంచెం జిగురుగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు దంతాల సందుల్లో ఇరుక్కుపోయి, వాటిలోని చక్కెర కారణంగా దంతాలు పుచ్చిపోయే (cavities) ప్రమాదం పెరుగుతుంది.
ఎంత తింటే మేలు..?
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో డ్రై ఫ్రూట్స్‌కు కచ్చితంగా స్థానం ఉండాలి. కానీ, ‘మితమే హితం’ అనే సూత్రాన్ని పాటించాలి. సాధారణంగా ఆరోగ్యవంతులు రోజుకు గుప్పెడు నట్స్ లేదా పరిమిత సంఖ్యలో ఎండు ఫలాలు తీసుకోవడం సరిపోతుంది. మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు తమ శరీర తత్వాన్ని, రోజువారీ ఆహార ప్రణాళికను బట్టి వైద్యుల లేదా డైటీషియన్ల సలహా మేరకు వీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. కిస్మిస్, అంజీర్ వంటివి తిన్న తర్వాత నోటిని శుభ్రంగా పుక్కిలించడం వల్ల దంత సమస్యలను నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
