హెయిర్ ఫాల్ కు కారణమయ్యే జీవనశైలి తప్పిదాలు..
సాక్షి లైఫ్ : జుట్టు రాలడం అనేది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా యువతలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల మార్పులు, కొన్ని రకాల వ్యాధులు జుట్టు రాలడానికి కారణమైనప్పటికీ, మన రోజువారీ జీవనశైలి, అలవాట్లే ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. తెలియకుండా మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసి, జుట్టు రాలిపోవడానికి దారితీస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమే..!
సరైన పోషకాహారం తీసుకోకపోవడం..
మన శరీరం ఎలాగైతే ఆహారం ద్వారా శక్తిని పొందుతుందో, జుట్టు కూడా పెరుగుదల, బలం కోసం పోషకాలు అవసరం. జుట్టు రాలడానికి ఒక ముఖ్య కారణం ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత. అలాగే, ప్రోటీన్, బయోటిన్, విటమిన్ డి, జింక్ వంటి పోషకాల లోపం కూడా జుట్టును బలహీనపరుస్తుంది. జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందవు.
పరిష్కారం: గుడ్లు, చేపలు, ఆకుకూరలు, గింజలు, పప్పులు, పండ్లు, బ్రకోలీ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి..
ఒత్తిడి అనేది నేరుగా జుట్టు రాలడానికి కారణమవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీసి, జుట్టు రాలడాన్ని పెంచుతుంది. అలాగే, తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరానికి పునరుత్పత్తి ప్రక్రియ సరిగా జరగదు. ఇది జుట్టు ఆరోగ్యానికి అవసరమైన కణాల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
పరిష్కారం: యోగా, ధ్యానం, వ్యాయామం, లోతైన శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రతిరోజు కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
తల స్నానం, హెయిర్ కేర్ విషయంలో చేసే తప్పులు..
రోజు తలస్నానం: ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల తలపై ఉండే సహజ నూనెలు పోయి, జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇది జుట్టు బలహీనపడి రాలడానికి దారితీస్తుంది.
వేడి నీటి వాడకం: చాలా మంది వేడి నీటితో తలస్నానం చేస్తారు. వేడి నీళ్లు జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి. కాబట్టి తలస్నానానికి గోరువెచ్చని లేదా చల్లని నీటిని వాడటం మంచిది.
కెమికల్ ఉత్పత్తులు: సల్ఫేట్, పారాబెన్స్ వంటి రసాయనాలు అధికంగా ఉండే షాంపూలు, హెయిర్ స్ప్రేలు, డైలు జుట్టు ఆరోగ్యానికి హానికరం.
పరిష్కారం: వారానికి 2-3 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. కెమికల్స్ లేని మైల్డ్ షాంపూలను ఎంచుకోవాలి.
- తడి జుట్టుతో దువ్వడం, గట్టిగా కట్టడం..
జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో గట్టిగా దువ్వితే జుట్టు ఎక్కువగా తెగిపోతుంది. అలాగే తడి జుట్టును గంటల తరబడి టవల్‌తో చుట్టి ఉంచడం కూడా మంచిది కాదు. జుట్టును గట్టిగా బిగుతుగా కట్టుకోవడం (ఉదాహరణకు, హై పోనీటైల్స్, టైట్ బ్రెయిడ్స్) వల్ల కుదుళ్లపై ఒత్తిడి పడి, 'ట్రాక్షన్ అలోపేసియా' అనే సమస్యకు దారితీస్తుంది.
పరిష్కారం: తలస్నానం తర్వాత జుట్టును సున్నితంగా ఆరనివ్వాలి. మెత్తటి టవల్‌తో తుడవాలి. తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. వీలైనంత వరకు జుట్టును వదులుగా వదిలేయాలి.
ధూమపానం, మద్యం సేవించడం..
ధూమపానం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. సిగరెట్ పొగలో ఉండే విష పదార్థాలు జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అడ్డుకుంటాయి. అదేవిధంగా అధికంగా మద్యం సేవించడం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
పరిష్కారం: ఈ చెడు అలవాట్లను మానుకోవడమే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం. జుట్టురాలు సమస్య ఎక్కువగా ఉంటే, తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ ని లేదా ట్రైకాలజిస్ట్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
