Lung Infection : లంగ్స్ ఇన్ఫెక్షన్ను ఎలా పసిగట్టాలి..? తప్పక తెలుసుకోవాల్సిన కీలక లక్షణాలు..
సాక్షి లైఫ్ : మెట్లు ఎక్కినప్పుడో లేదా కాస్త వేగంగా నడిచినప్పుడో శ్వాస తీసుకోవడం కాస్త కష్టంగా అనిపించడం సహజమే. కానీ, చిన్నపాటి పనులకే తీవ్రమైన ఆయాసం రావడం, తరచూ ఊపిరి అందనట్లు అనిపించడాన్ని సాధారణ నీరసంగానో, అలసటగానో భావించి నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇది శరీర అంతర్గత అవయవాలు ఇచ్చే ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన పలు దీర్ఘకాలిక సమస్యల ప్రారంభ దశలో ఆయాసం ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. సరైన సమయంలో వైద్యులను సంప్రదించకపోతే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఊపిరితిత్తుల సమస్యల ముప్పు..
పొగతాగే అలవాటు, నిరంతరం వాయు కాలుష్యం, దుమ్ము-ధూళి మధ్య ఉండేవారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది.
శ్వాసనాళాల్లో వాపు వచ్చి అవి సన్నబడటం వల్ల గాలి ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా ఆయాసంతో పాటు ఛాతీలో బిగుతుగా ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలు (wheezing), నిరంతర దగ్గు కనిపిస్తాయి. అలర్జీలు, చల్లని గాలి వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
సీవోపీడీ (COPD)..
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది శ్వాస మార్గాలకు తీవ్ర అవరోధం కలిగించే రుగ్మత. ధూమపానం లేదా కాలుష్యం దీనికి ప్రధాన కారణాలు. తెమడతో కూడిన దగ్గు, నిరంతర ఆయాసం, రోజువారీ పనులు చేయలేకపోవడం దీని లక్షణాలు.
న్యుమోనియా..
ఊపిరితిత్తుల్లోని గాలితిత్తులు ఇన్ఫెక్షన్కు గురై ద్రవాలు లేదా చీముతో నిండిపోతాయి. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. తీవ్రమైన జ్వరం, ఛాతీనొప్పి, దగ్గుతో పాటు ఆకస్మికంగా ఆయాసం వస్తుంది. వృద్ధులు, పిల్లల్లో ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
ఇతర శారీరక కారణాలు..
ఆయాసానికి ఊపిరితిత్తులే కాకుండా శరీరంలోని ఇతర వ్యవస్థల్లో లోపాలు కూడా కారణం కావచ్చు. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు (heart failure) అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో స్వల్ప నడకకే విపరీతమైన ఆయాసం వస్తుంది.
ఎనీమియా..
శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్లే సామర్థ్యం క్షీణిస్తుంది. ఫలితంగా త్వరగా అలసట, ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది.
థైరాయిడ్ సమస్యలు..
థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, శ్వాసలో అసౌకర్యం తలెత్తుతాయి. ఊబకాయం..అధిక శరీర బరువు ఉన్నప్పుడు శరీర భాగాలను కదిలించడానికి గుండె, ఊపిరితిత్తులు రెట్టింపు శ్రమ చేయాల్సి వస్తుంది.
మానసిక ఒత్తిడి.. విపరీతమైన ఆందోళన (Anxiety), పానిక్ ఎటాక్ వచ్చినప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీలో ఒత్తిడి సాధారణం. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా ఆయాసం రావడం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు ఛాతీలో నొప్పి లేదా బరువుగా అనిపించడం. పెదవులు లేదా గోళ్లు నీలంగా మారడం. ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం, దగ్గుతో పాటు ఆయాసం పెరగడం.
చిన్నపాటి అసౌకర్యాన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే తీవ్ర సమస్యలను నివారించవచ్చు. తరచూ ఆయాసం వేధిస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
