Heart Health : మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ హ్యాబిట్స్ మార్చుకోండి..!
సాక్షి లైఫ్ : గుండె.. మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. కానీ, ఏదైనా ఇబ్బంది తలెత్తితే తప్ప మనం దాని ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. గుండె జబ్బులు చాలావరకు ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలను చూపించవు. కొందరిలో వ్యాధి తీవ్రమయ్యే వరకు ముందస్తు సంకేతాలేమీ కనిపించవు. అయితే, మన రోజువారీ దైనందిన జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె జబ్బుల ముప్పు ఎందుకు పెరుగుతుంది..?
వయసు పైబడటం, వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన కారణాలను మనం మార్చలేం. కానీ, మన చేతుల్లో ఉన్న మరికొన్ని ముప్పు కారకాలను నియంత్రించుకోవచ్చని కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు. అధిక రక్తపోటు (bp), చెడు కొలెస్ట్రాల్, మధుమేహం (diabetes), ధూమపానం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, మద్యం సేవించడం, నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి.. ఇవన్నీ గుండె జబ్బులకు ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గుండె ఆరోగ్యానికి సరైన సూత్రాలు..
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ.. గుండె పదిలంగా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు, చక్కెర, నూనెలో వేయించిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
రోజూ శారీరక శ్రమ..ఆరోగ్యంగా ఉండేందుకు గంటల తరబడి జిమ్‌లో చెమట చిందించాల్సిన పనిలేదు. కనీసం వారానికి 150 నిమిషాల పాటు చురుకైన వ్యాయామం, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయాలి. వ్యాయామం అలవాటు లేని వారు రోజుకు 15 నిమిషాల నడకతో ప్రారంభించి క్రమంగా సమయం పెంచుకోవచ్చు. పొగాకుకు పూర్తి దూరం.. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ముప్పును పెంచుతాయి. కాబట్టి వెంటనే పొగతాగే అలవాటును మానేయాలి.
బీపీ నిర్లక్ష్యం వద్దు..అధిక రక్తపోటు అనేది ఒక సైలెంట్ కిల్లర్. చాలాసార్లు ఇది ఎలాంటి లక్షణాలను చూపించకుండానే రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది. అందుకే క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాలి. మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా లేకుండా వాటిని ఆపకూడదు. కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షలు..రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL), గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. డాక్టర్ సలహా మేరకు తరచుగా పరీక్షలు చేయించుకుని, వీటిని అదుపులో ఉంచుకోవాలి.
బరువు నియంత్రణ.. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ముప్పు పెరుగుతుంది. బరువు తగ్గేందుకు పీచు పదార్థాలు (fiber) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, స్వీట్లకు దూరంగా ఉండాలి. కంటినిండా నిద్ర.. గుండె ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. నిద్రలో తీవ్రమైన గురక, ఆయాసం ఉంటే వైద్యులను సంప్రదించాలి.
ఒత్తిడికి చెక్..దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఒత్తిడికి గురైనప్పుడు చాలామంది ఎక్కువగా తినడం లేదా స్మోకింగ్ చేస్తుంటారు. వీటికి బదులుగా.. ధ్యానం చేయడం, వాకింగ్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని జయించాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు..!
ఛాతీలో నొప్పి లేదా పట్టేసినట్లు ఉండటం, ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన అలసట, కళ్లు తిరగడం, గుండె లయ తప్పడం, కాళ్ల వాపులు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు వచ్చే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, వెన్ను లేదా దవడ నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చి.. ఆ నొప్పి ఎడమ చేయి, భుజం, దవడకు వ్యాపిస్తూ, చల్లటి చెమటలు పడుతుంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. గుండె ఆరోగ్యం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి చిన్న చిన్న మంచి అలవాట్లే దీర్ఘకాలంలో మీ గుండెను పదిలంగా కాపాడతాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
