Diabetes and High Blood Pressure: మధుమేహం.. రక్తపోటు..దాడితో గుండె, కిడ్నీలకు ముప్పు..!
సాక్షి లైఫ్ : భారతీయులను జీవనశైలి వ్యాధులు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (hypertension) రెండూ ఒకేసారి దాడి చేస్తూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. దేశంలో పెద్దవారిపై నిర్వహించిన విస్తృత అధ్యయనాల ప్రకారం.. దాదాపు ప్రతి 20 మందిలో ఒకరు ఈ రెండు సమస్యలతో ఏకకాలంలో బాధపడుతున్నట్లు తేలింది. వయసు 40 దాటిన తర్వాత ఈ జంట వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
జంట సమస్యతో ఎందుకింత ప్రమాదం..?
శరీరంలో చక్కెర స్థాయులు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు క్రమంగా దెబ్బతింటాయి. మరోవైపు అధిక రక్తపోటు రక్తనాళాల గోడలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు శరీరంలోని కీలక అవయవాలపై భారం రెట్టింపవుతుంది.
గుండె జబ్బులు, పక్షవాతం..రక్తనాళాలు గట్టిపడటం, పూడికలు ఏర్పడే వేగం పెరిగి గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు తీవ్రమవుతాయి. కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (chronic kidney disease) వేగంగా ముదురుతుంది. కంటి రెటీనాలోని రక్తనాళాలు చిట్లిపోయి దృష్టి లోపాలు, అంధత్వం వచ్చే ముప్పు పెరుగుతుంది.
ఒకదానికొకటి ఎలా లింక్..?
డయాబెటిస్ ఉన్నవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. అధిక రక్తపోటుతో బాధపడేవారికి మధుమేహం బారిన పడే ముప్పు సుమారు రెండున్నర రెట్లు అధికం. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి.. ఈ రెండింటికీ ఉమ్మడి కారణాలుగా నిలుస్తున్నాయి.
ఉమ్మడి పరీక్షలు తప్పనిసరి..
షుగర్ ఉన్నవారు కేవలం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా బీపీని కూడా పరీక్షించుకోవాలి. అలాగే హైపర్ టెన్షన్ ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించుకోవాలి. వైద్యులు సూచించిన మందులను సొంత నిర్ణయాలతో ఆపడం లేదా మోతాదు మార్చడం ప్రాణాంతకం కావచ్చు. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. అధిక క్యాలరీలు, తీపి పదార్థాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పీచు పదార్థాలు (fiber) ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి.
రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్, యోగా వంటి వ్యాయామాలు చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని మరింత వేగంగా దెబ్బతీస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
