Body Mass Index : మీ బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఆందోళన కలిగిస్తోందా..? అసలు ఎంత ఉండాలి..?
సాక్షి లైఫ్ : కేవలం బరువు చూసుకుని మురిసిపోవడమో, బాధపడట మో కాదు.. ఆ బరువు మీ ఎత్తుకు తగినట్లుగా ఉందా లేదా అనేది ముఖ్యం. దీన్నే 'బాడీ మాస్ ఇండెక్స్' (BMI) అంటారు. ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. అధిక బరువు కేవలం శరీర ఆకృతిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. వైద్య నిపుణులు ఏ వ్యక్తి ఆరోగ్యాన్నైనా కేవలం బరువును బట్టి కాకుండా బీఎంఐ ఆధారంగానే అంచనా వేస్తారు.
ఇది కూడా చదవండి..Weight loss : ఇంట్లోనే చేసే 4 సింపుల్ వ్యాయామాలతో రోజుకు కేవలం 10 నిమిషాలు.. 8 నెలల్లో 34 కిలోలు తగ్గిన గృహిణి..!
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
అసలు బీఎంఐ అంటే ఏమిటి..?
శరీర ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అని నిర్ధారించే ప్రాథమిక సూచిక ఇది. మీ బరువును కిలోగ్రాముల్లో, మీ ఎత్తు మీటర్లలో వర్గంతో భాగించడం ద్వారా బీఎంఐని లెక్కించవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి 70 కిలోల బరువు, 1.70 మీటర్ల ఎత్తు ఉంటే.. వారి బీఎంఐ సుమారుగా 24.2 ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన బీఎంఐ ప్రమాణాలు..
మీ బీఎంఐ విలువ ఆధారంగా మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఎలా తెలుసుకోవాలంటే..?
బాడీ మాస్ ఇండెక్స్ (BMI) విలువల ఆధారంగా ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిని సులభంగా అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి బీఎంఐ విలువ 18.5 కంటే తక్కువగా ఉంటే, వారు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు (Underweight) ఉన్నట్లు పరిగణిస్తారు. అదే బీఎంఐ విలువ 18.5 నుంచి 24.9 మధ్య ఉంటే, వారిది ఆరోగ్యకరమైన లేదా సాధారణ బరువు (Normal weight) అని అర్థం. ఒకవేళ ఈ సూచీ 25 నుంచి 29.9 మధ్య ఉంటే వారు అధిక బరువు (Overweight) తో ఉన్నారని నిర్ధారిస్తారు. ఇక బీఎంఐ విలువ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, ఆ స్థితిని ఆరోగ్యానికి హాని కలిగించే స్థూలకాయం (Obesity) గా వైద్యులు పరిగణిస్తారు.
బీఎంఐ పరిమితి దాటితే పొంచి ఉన్న ప్రమాదాలు..
బీఎంఐ సాధారణ స్థాయి (25) కంటే ఎక్కువగా ఉంటే, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతున్నట్లు లెక్క. ఇది శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు రసాయనాలను విడుదల చేసి రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీసి.. దీర్ఘకాలంలో గుండెపోటు, పక్షవాతం (stroke) వంటి ముప్పులను తెచ్చిపెడుతుంది.
శరీరంలో కొవ్వు శాతం పెరిగినప్పుడు, కణాలు ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించుకోలేవు (insulin resistance). దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయి మధుమేహం బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.అధిక బీఎంఐ ఉన్నవారు 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. దీన్ని సకాలంలో నియంత్రించకపోతే కాలేయ వాపు, ఫైబ్రోసిస్, చివరకు సిర్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.ఊబకాయం వల్ల శరీరంలో నిరంతర వాపు (Inflammation) ఏర్పడుతుంది. ఇది కణాల అసాధారణ పెరుగుదలకు దారితీసి దాదాపు 13 రకాల క్యాన్సర్లకు రొమ్ము, పెద్దప్రేగు తదితర క్యాన్సర్లకు కారణమవుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
బీఎంఐని అదుపులో ఉంచుకోవడం ఎలా..?
సాధారణ బీఎంఐని నిర్వహించడానికి రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం అంటే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి చేయాలి. ఇది అదనపు క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది.
ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, తాజా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోండి. రోజుకు 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ బీఎంఐ క్రమంగా పెరుగుతూ 25 దాటినా, లేదా ఇప్పటికే 30కి చేరుకున్నా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
