Low-Carb Diet : బరువు తగ్గడానికి లో-కార్బ్ డైట్ పాటిస్తున్నారా..? గుండెకు ముప్పు తెచ్చుకోకండి..!
సాక్షి లైఫ్ : బరువు తగ్గించుకోవడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి చాలామంది 'లో-కార్బ్ డైట్' అంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం వైపు మొగ్గు చూపు తుంటారు. అయితే, ఈ డైట్ అందరికీ ఒకేలా మేలు చేయదని, కొన్ని సందర్భాల్లో ఇది గుండె ఆరోగ్యానికి చేటు చేయవచ్చని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం..
అన్నం, రోటీ, బ్రెడ్, బంగాళాదుంపలు వంటి పిండి పదార్థాలను తగ్గించి.. వాటి స్థానంలో అధికంగా శాచురేటెడ్ ఫ్యాట్ (రెడ్ మీట్, చీజ్, బటర్ వంటివి) తీసుకున్నప్పుడు రక్తంలో 'చెడు కొలెస్ట్రాల్' (LDL) వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తప్రసరణకు అడ్డంకిగా మారి గుండెపోటు (Heart attack), పక్షవాతం (stroke) వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్..?
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వంశపారంపర్యంగా లేదా జన్యుపరంగా గుండె జబ్బుల ముప్పు ఉన్న వ్యక్తులు అధిక శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న లో-కార్బ్ డైట్ తీసుకున్నప్పుడు, వారిలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నట్లు గుర్తించారు.
అందరికీ ఒకే ఫార్ములా సరిపడదు..
ఒకరికి మేలు చేసిన డైట్ పద్ధతి మరొకరికి కూడా సరిపోతుందనే నియమం లేదు. జీవక్రియలు, జన్యుపరమైన అంశాల ఆధారంగా ఆహారపు అలవాట్ల ప్రభావం మారుతుంటుంది.
ప్రత్యామ్నాయంగా ..
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నిపుణులు పలు ముఖ్యమైన జాగ్రత్తలను సూచిస్తున్నారు. ప్రధానంగా, రోజువారీ తీసుకునే ఆహార కేలరీలలో శాచురేటెడ్ ఫ్యాట్ 10 శాతానికి మించకుండా చూసుకోవాలి; అంటే పురుషులు రోజుకు గరిష్టంగా 30 గ్రాములు, మహిళలు 20 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. జంతు సంబంధిత కొవ్వులకు దూరంగా ఉంటూ, వాటికి ప్రత్యామ్నాయంగా నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ లాంటి విత్తనాలతో పాటు చేపలు, ఆలివ్ నూనె వంటి అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెండుగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.
కఠినమైన డైట్‌లు..
అలాగే, ఇతరులను చూసి సొంతంగా కఠినమైన డైట్‌లు ఎప్పుడూ ప్రారంభించకూడదు. ముందుగా వైద్యులు లేదా అర్హత కలిగిన న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే మీ శరీర తత్వానికి సరిపడే సరైన ఆహార ప్రణాళికను రూపొందించు కోవాలి. గుండె పదిలంగా ఉండాలంటే కేవలం పిండి పదార్థాలను తగ్గించడమే కాకుండా, శరీరానికి అందుతున్న కొవ్వులు ఎటువంటివనే దానిపై కూడా స్పష్టమైన అవగాహన ఉండాలని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?
ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
