Mango : మామిడి పండు.. రుచికే కాదు, ఆరోగ్యానికి మేటి! పసందైన పండుతో ఇన్ని లాభాలా..?
సాక్షి లైఫ్ : వేసవి వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల సువాసనలు పలకరిస్తాయి. పండ్లలో రారాజుగా పిలుచుకునే మామిడి కేవలం రుచికే కాదు, పోషకాల విషయంలోనూ మేటి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన ఈ పండును సరైన పద్ధతిలో, మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మామిడి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఒకసారి పరిశీలిద్దాం..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
రోగనిరోధక శక్తికి ప్రధానం..
మామిడి పండులో విటమిన్-సి, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల మామిడిలో సుమారు 36 మిల్లీగ్రాముల విటమిన్-సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
మామిడిలోని విటమిన్-సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, కణజాల మరమ్మత్తు వేగంగా జరుగుతుంది. మామిడిలో ఉండే విటమిన్-ఎ కంటిచూపు మెరుగుపడటానికి ఎంతగానో దోహదపడుతుంది. రేచీకటి వంటి సమస్యలను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వ్యాధులకు చెక్..
ఇందులో ఉండే మాంగిఫెరిన్, క్వెర్సెటిన్, బీటా-కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. తద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. మామిడి పండులో ఫైబర్ తోపాటు కొన్ని సహజ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. అయితే, వీటిని మితంగా తీసుకోవాలి. అధికంగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా విరేచనాల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
తక్షణ శక్తి.. ఎలక్ట్రోలైట్ల సమతుల్యత..
వేసవిలో చెమట రూపంలో శరీరం నీటిని, లవణాలను కోల్పోతుంది. మామిడిలో ఉండే సహజ చక్కెరలు ఫ్రక్టోజ్, గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం మూలకాలు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడి, కండరాలు, నరాలు చురుగ్గా పనిచేసేలా చూస్తాయి.
మధుమేహులు, బరువు తగ్గేవారు జాగ్రత్త..!
మామిడి పండ్లు ఎంత ఆరోగ్యకరమైనా.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మామిడిలో సహజ చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు చాలా పరిమితంగా తీసుకోవాలి. అతిగా మామిడి పండ్లు తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా తీసుకునేటప్పుడు పరిమాణంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మామిడి పండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం. దీనిని మితంగా ఆస్వాదిస్తూ, వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..!
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.