Superfoods : ఆరోగ్యం కోసం మీ డైట్‌లో ఉండాల్సిన సూపర్ ఫుడ్స్..
సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆకలి వేయగానే చాలామంది చిప్స్, కుకీస్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వైపు మొగ్గు చూపు తుంటారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ వీటిలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రుచితో పాటు ఆరోగ్యం కూడా కావాలనుకుంటే, మన వంటగదిలోనే సులభంగా లభించే ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి ఖరీదైన స్నాక్స్ కంటే ఎంతో మేలు చేస్తాయి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
సూపర్ ఫుడ్స్..
వేయించిన శనగలు ప్రోటీన్, ఫైబర్‌కు కేరాఫ్..
అత్యంత చౌకైన, పోషక విలువలున్న స్నాక్స్‌లో ఇవి ముందుంటాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి, పదేపదే తినాలనే కోరిక తగ్గుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మఖానా తేలికైన పోషకాల గని..
తామర గింజలనే మఖానా అంటారు. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని కొద్దిగా నెయ్యిలో వేయించుకుని సాయంత్రం వేళ స్నాక్స్‌గా తీసుకుంటే చాలా మంచిది. క్యాలరీలు తక్కువగా ఉండే మఖానా.. ప్యాకేజ్డ్ చిప్స్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయం.
పెరుగు ప్రోబయోటిక్స్ ఖజానా..
పెరుగులో ప్రోటీన్, కాల్షియంతో పాటు పేగుల ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇందులో తాజా పండ్లు లేదా గింజలు కలుపుకుని తింటే పోషకాలు రెట్టింపు అవుతాయి.
బాదం, వాల్‌నట్స్ హెల్తీ ఫ్యాట్స్..
ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని రోజుకు గుప్పెడు తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. జంక్ ఫుడ్ తినాలనే కోరికను ఇవి తగ్గిస్తాయి. ఆఫీసులో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు తినడానికి ఇవి ఎంతో అనుకూలం.
మొలకెత్తిన పెసలు పోషకాల పవర్ ప్యాక్..
మొలకలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పెసలకు కొద్దిగా నిమ్మరసం, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర కలుపుకుని రుచికరమైన సలాడ్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్యకరమైన స్నాకింగ్ కోసం కొన్ని చిట్కాలు..
ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ కాకుండా, ముందుగా ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎంచుకోండి.
బయట దొరికే ప్యాకేజ్డ్ స్నాక్స్ బదులు, ఇంట్లో తయారు చేసిన పోషకభరితమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వండి.
శరీరం డీహైడ్రేట్ కాకుండా, రోజంతా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోండి.
స్నాక్స్ ఏవైనా సరే, తినే పరిమాణంపై నియంత్రణ (పోర్షన్ కంట్రోల్) ఉంచుకోండి.
తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ను తప్పనిసరిగా మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.
