DASH Diet :వయసుతో నిమిత్తం లేని 'సైలెంట్ కిల్లర్'.. బీపీని కట్టడి చేసే 'డాష్' మంత్రం..!
సాక్షి లైఫ్ : యువతను వేగంగా కబళిస్తోన్న అధిక రక్తపోటు సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కేవలం వృద్ధులకే పరిమితమనుకున్న ఈ వ్యాధి, నేడు ఆధునిక జీవనశైలి పుణ్యమా అని 30 ఏళ్లలోపు యువతీయువకులను సైతం వెంటాడుతోంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ సమస్య బారిన పడిన వారిలో చాలామందికి తమకు బీపీ ఉందనే విషయమే తెలియకపోవడం..! అందుకే వైద్యులు దీనిని 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు.
సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే ఇది గుండె, మూత్రపిండాలు, మెదడు, కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, మారిన ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం కాగా.. సరైన పోషకాహార నియమాలతో దీనిని సులభంగా అదుపు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రక్తపోటును సమర్థంగా తగ్గించే 'డాష్' (DASH) డైట్ విశేషాలు మీకోసం..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఏంటిది డాష్ (DASH) డైట్..?
DASH అంటే 'డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్' (Dietary Approaches to Stop Hypertension). అంటే ఆహార నియమాల ద్వారా రక్తపోటుకు అడ్డుకట్ట వేసే శాస్త్రీయ విధానం. కేవలం కొన్ని వారాల పాటు ఈ ఆహార ప్రణాళికను క్రమం తప్పకుండా పాటిస్తే, సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు రీడింగ్స్‌లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఆహార ప్రణాళిక ఎలా పనిచేస్తుంది..?
శరీరంలో సోడియం (ఉప్పు) శాతాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను పెంచడమే ఈ డైట్ ముఖ్య ఉద్దేశ్యం. ఆహారంలో ఉప్పును తగ్గించడం వల్ల రక్తనాళాలపై పెరిగే అదనపు ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు రక్తనాళాలు సజావుగా పనిచేసేలా చూస్తాయి.
'డాష్' మెనూలో ఏం చేర్చుకోవాలి? ఏం వదిలేయాలి..? ఈ డైట్ ప్లాన్ ప్రకారం రోజువారీ ఆహారంలో కింది మార్పులు చేసుకోవడం అవసరం..
ప్రాధాన్యత ఇవ్వాల్సినవి..
పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభించే తాజా పండ్లు, ఆకుకూరలను ప్రతిరోజూ భాగం చేసుకోవాలి. పాలిష్ చేయని దంపుడు బియ్యం, ఓట్స్, మల్టీగ్రెయిన్ గోధుమలు, గంజి వంటి సంపూర్ణ ధాన్యాలు ఉత్తమం.
తక్కువ కొవ్వు పాలు..
వెన్న తీసిన పాలు, పెరుగు, జున్ను ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. కందిపప్పు, శనగలు, కిడ్నీ బీన్స్ తో పాటు చర్మం లేని చికెన్, చేపలు తీసుకోవచ్చు.
నట్స్ అండ్ సీడ్స్..
బాదం, వాల్‌నట్స్, వివిధ రకాల గింజలు గుండెకు మేలు చేసే కొవ్వులను అందిస్తాయి.
నిషేధించాల్సినవి..
ఉప్పు, నిల్వ పచ్చళ్లు.. ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని బాగా తగ్గించాలి.
జంక్ ఫుడ్స్..
బేకరీ ఐటమ్స్, చిప్స్, సమోసాలు, ప్రాసెస్ చేసిన ప్యాకెట్ ఆహారాలు.
తీపి పదార్థాలు..
శీతల పానీయాలు, అధిక చక్కెర ఉండే స్వీట్లు.
రెడ్ మీట్..
కొవ్వు ఎక్కువగా ఉండే మటన్ వంటి మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.
ఇతర ఆరోగ్యప్రయోజనాలు..
డాష్ డైట్ కేవలం రక్తపోటును నియంత్రించడానికే కాదు, ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా రామబాణంలా పనిచేస్తుంది. బరువు నియంత్రణ.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం వల్ల బరువు సులభంగా అదుపులోకి వస్తుంది. మధుమేహం అదుపులో ఉంటుంది.. రక్తంలో చక్కెర నిల్వలు స్థిరంగా ఉంటాయి. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలు దరిచేరవు.
ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర, జంక్ ఫుడ్‌కు దూరం, ఒత్తిడి లేని జీవనశైలి ఈ 'డాష్' డైట్ తోడుగా ఉంటే అధిక రక్తపోటును సులభంగా జయించవచ్చు. అయితే, ఏదైనా కొత్త డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
