కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..
సాక్షి లైఫ్ : నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ధూమపానం, మద్యం సేవించడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వంటివి కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. చాలా మంది ఈ సంకేతాలను ప్రారంభంలో గుర్తించలేరు. అయితే, శరీరం లివర్ డ్యామేజ్ ప్రారంభం నుంచే కొన్ని సంకేతాలను ఇవ్వడం మొదలుపెడుతుంది. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించి సరైన చికిత్స పొందడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?
ఇది కూడా చదవండి.. వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?
లివర్ దెబ్బతిన్నప్పుడు కనిపించే ప్రధాన సంకేతాలు..
కామెర్లు..
కామెర్లు కాలేయం దెబ్బతినడానికి అత్యంత సాధారణ లక్షణం. ఈ స్థితిలో, చర్మం, కళ్ళలోని తెల్లటి భాగం, గోర్లు పసుపు రంగులోకి మారడం మొదలవుతాయి. కాలేయం బిలిరుబిన్ (పసుపు వర్ణద్రవ్యం)ను సరిగా ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల శరీరం పసుపు రంగులో కనిపిస్తుంది. ప్రారంభంలో కళ్లు కొద్దిగా పసుపు రంగులో కనిపిస్తాయి. ఆ సంశయంలో చికిత్స చేయకపోతే క్రమంగా సమస్య పెరుగుతుంది.
కడుపు ఉబ్బడం, నొప్పి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు, కడుపు కుడి పైభాగంలో నొప్పి లేదా భారంగా అనిపించవచ్చు. అలాగే, కడుపు ఉబ్బినట్లు వాపు కూడా ఉండవచ్చు. కాలేయం కడుపు కుడి ఎగువ భాగంలో ఉంటుంది కాబట్టి, కాలేయ సమస్యలు కడుపులో నొప్పి లేదా వాపునకు దారితీస్తాయి.
అలసట,బలహీనత..
కాలేయం దెబ్బతిన్నప్పుడు, శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల నిరంతరం అలసట, బలహీనత వెంటాడుతాయి. ఎటువంటి శ్రమ లేకుండానే శక్తి లేనట్లు అనిపించడం, నీరసం కాలేయ సమస్యలకు సంకేతాలు కావచ్చు.
చర్మం దురద, దద్దుర్లు..
కాలేయం సరిగా పనిచేయనప్పుడు, రక్తంలో పిత్తం పేరుకుపోతుంది. ఇది చర్మంలో తీవ్రమైన దురదకు దారితీస్తుంది. కొన్నిసార్లు దద్దుర్లు లేదా సాలీడు గూడు లాంటి గుర్తులు (స్పైడర్ ఆంజియోమాస్) కూడా చర్మంపై కనిపిస్తాయి.
జీర్ణ సమస్యలు..
కాలేయం దెబ్బతిన్నప్పుడు జీర్ణవ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, తరచుగా విరేచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, మలంలో రక్తం కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. అందువల్ల వీటిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోవడం అవసరం.
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..మెదడు కణితులకు జన్యుపరమైన కారణాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.