Unhealthy Eating Habits : చెడు ఆహారపు అలవాట్లతో ఏటా 40 లక్షల మరణాలు.. పరిశోధకులు వెల్లడి..
సాక్షి లైఫ్ : మనం తినే ఆహారమే మనకు ఔషధం కావాలి.. కానీ, ప్రస్తుత కాలంలో అదే ఆహారం యమపాశంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 'చెడు ఆహారపు అలవాట్లు' ప్రధాన విలన్‌గా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం నాసిరకం ఆహారం కారణంగానే 2023లో ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా 'ఇస్కీమిక్ గుండె జబ్బు'తో ప్రాణాలు కోల్పోయినట్లు తాజా అధ్యయనం స్పష్టం చేసింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడాన్నే ఇస్కీమిక్ గుండె జబ్బు అంటారు. దీనివల్ల ధమనులు సన్నబడి, రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా ఛాతీ నొప్పి రావడం, చివరకు అది ప్రాణాంతక గుండెపోటుకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
అధ్యయనంలో..
అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ , దక్షిణ కొరియాలోని క్యుంగ్ హీ విశ్వవిద్యాలయ పరిశోధకులు 'నేచర్ మెడిసిన్' జర్నల్‌లో ఈ వివరాలను వెల్లడించారు. 204 దేశాల్లోని ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ఈ గణాంకాలను పరిశీలిస్తే మన ఆహారపు అలవాట్లు ప్రాణాపాయానికి ఎలా దారితీస్తున్నాయో స్పష్టమవుతోంది. 1990తో పోలిస్తే.. ఆహారపు లోపాల వల్ల సంభవించే గుండె జబ్బుల మరణాలు 41.59 శాతం పెరిగాయి. 45 ఏళ్ల లోపు వారితో పోలిస్తే, 65 ఏళ్లు పైబడిన వారిలోనే ఈ ముప్పు అత్యధికంగా ఉంది.
ప్రతి లక్ష జనాభాలో సంభవిస్తున్న మరణాల రేటును విశ్లేషిస్తే, ఆహారంలో నట్స్, సీడ్స్ తీసుకోకపోవడం వల్ల అత్యధికంగా 9.87 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని తర్వాత తృణధాన్యాల (Whole Grains) కొరత కారణంగా 9.22 మంది, తగినంతగా తాజా పండ్లు తినకపోవడం వల్ల 7.25 మంది మరణిస్తున్నారు. వీటన్నింటితో పాటు ఆహారంలో అధికంగా ఉప్పు వాడటం వల్ల 7.15 మరణాల రేటు నమోదవుతోంది. అంటే, కేవలం పోషకాహార లోపం మాత్రమే కాకుండా, అనారోగ్యకరమైన పదార్థాలను అధికంగా తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
15 పేద దేశాల్లో..
ధనిక దేశాల్లో మరోలా..ఈ అధ్యయనం మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో పోషకాహార లోపం వల్ల గుండె జబ్బులు వస్తుంటే, సంపన్న దేశాల్లో అధికంగా ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల గుండెలు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. కేవలం ఆహారం మాత్రమే కాకుండా.. ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండెపోటుకు ప్రధాన కారణాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
