Vitamin B12 Deficiency : విటమిన్ 'బి12' తక్కువైతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా మన శరీరం కొన్ని నిశ్శబ్ద సంకేతాలను పంపిస్తుంది. వాటిని సరైన సమయంలో గుర్తించి జాగ్రత్తపడితే ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న సమస్య విటమిన్ బి12 లోపం. రక్తహీనత నుంచి నాడీ వ్యవస్థ దెబ్బతినడం వరకు ఇది అనేక అనర్థాలకు దారితీస్తుంది. బి12 లోపించినప్పుడు కనిపించే సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

ఈ సంకేతాలను అస్సలు విస్మరించకండి..!

 రాత్రంతా హాయిగా నిద్రపోయినా, ఉదయం లేవగానే తీవ్రమైన నీరసం, అలసటగా అనిపిస్తుంటే శరీరంలో బి12 నిల్వలు తగ్గాయని అర్థం. జీర్ణకోశ సమస్యలు.. వికారం, వాంతులు లేదా తరచుగా విరేచనాలు కావడం వంటి సమస్యలు ఈ విటమిన్ లోపం వల్ల తలెత్తవచ్చు. కారణం లేకుండానే ఆకలి తగ్గడం, వేగంగా బరువు తగ్గిపోవడం కూడా దీని సంకేతాలే. నాలుక ఎర్రగా కమిలిపోవడం, వాపు రావడం లేదా తరచుగా నోటి పూత వేధిస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గడం వల్ల చర్మం సహజత్వాన్ని కోల్పోయి పసుపు రంగులోకి అంటే కామెర్ల మాదిరిగా మారుతుంది.

చిరాకు, కోపం.. 

చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చిరాకు పడటం, మానసిక స్థితి (Mood) తరచుగా మారిపోవడం వంటివి బి12 లోపాన్ని సూచిస్తాయి. వ్యక్తి ఆలోచనా తీరులో లేదా ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు రావడం కూడా గమనించదగ్గ అంశం.

నరాలపై ప్రభావం పడితే..

బి12 లోపం తీవ్రమైతే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళలో సూదులతో గుచ్చినట్లు ఉండటం లేదా తరచుగా తిమ్మిర్లు రావడం. విషయాలను త్వరగా మర్చిపోవడం, పనిపై ఏకాగ్రత కుదరకపోవడం. నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల నడిచేటప్పుడు సమతుల్యత కోల్పోవడం, మాట తడబడటం వంటివి జరగవచ్చు.

లోపాన్ని అధిగమించడం ఎలా..?

మన శరీరం విటమిన్ బి12ను సొంతంగా తయారు చేసుకోలేదు. కేవలం ఆహారం, సప్లిమెంట్ల ద్వారానే దీనిని పొందాలి. పాలు, పెరుగు, గుడ్లు, మాంసం, చికెన్ వంటి జంతు సంబంధిత ఆహారాల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. శాకాహార పద్ధతులు పాటించే వారు వైద్యుల సలహా మేరకు బి12 సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్నవారు సొంత వైద్యం చేసుకోకుండా, రక్త పరీక్ష చేయించుకుని వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవడం మంచిది. 

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.