Bad Cholesterol : ఖర్జూరాలు తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుందా..?
సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక కొలెస్ట్రాల్. రక్తంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయిలు పెరిగినప్పుడు, ధమనులలో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఇది చివరకు గుండెపోటు (heart attack), పక్షవాతం (stroke) వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో రోజువారీ ఆహారంలో ఖర్జూరాలు (Dates) చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తాజా అధ్యయనాలు, వైద్యనిపుణుల మాటల్లో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
కేవలం ఖర్జూరాలు తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందా..?
కేవలం ఖర్జూరాలు మాత్రమే తినడం వల్ల కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోదు. అయితే, సమతుల్యమైన జీవనశైలి 'మెడిటరేనియన్ తరహా ఆహారం' (ఆకుకూరలు, నట్స్, తృణధాన్యాలతో కూడిన డైట్) లో భాగంగా వీటిని పరిమితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలి వైద్య పరిశోధనల ప్రకారం, ఖర్జూరాల్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు (ఫ్లేవనాయిడ్లు, ఫెనోలిక్ యాసిడ్స్) శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులపై జరిగిన కొన్ని అధ్యయనాలలో, పరిమితంగా ఖర్జూరాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ప్రొఫైల్‌లో సానుకూల మార్పులు వచ్చినట్లు తేలింది.
ఖర్జూరాలలోని అద్భుత పోషక విలువలు-ఆరోగ్య ప్రయోజనాలు..
ఖర్జూరాలలో శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల ఖర్జూరాల నుంచి శరీరానికి లభించే పోషకాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే.. ఇందులో సుమారు 7 నుంచి 8 గ్రాముల వరకు డైటరీ ఫైబర్ (fiber) ఉంటుంది, ఇది మలబద్ధకం నివారణకు, జీర్ణక్రియ మెరుగుదలకు, అద్భుతంగా తోడ్పడుతుంది. అలాగే, గుండె ఆరోగ్యానికి రక్తపోటు (bp) నియంత్రణకు అవసరమైన పొటాషియం ఇందులో రోజువారీ అవసరంలో 15 శాతం వరకు లభిస్తుంది.
నాడీ వ్యవస్థ, కండరాల సక్రమమైన పనితీరుకు ఉపయోగపడే మెగ్నీషియం కూడా రోజువారీ అవసరంలో 13 శాతం వరకు అందుతుంది. ఎముకల బలానికి, శరీరంలో శక్తి ఉత్పత్తికి అత్యంత కీలకమైన రాగి (Copper) ఈ ఫలంలో ఏకంగా 40 శాతం వరకు లభించడం విశేషం. వీటన్నింటితో పాటు, ఖర్జూరాలలో అత్యధిక పరిమాణంలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఖర్జూరాలలో సహజ సిద్ధమైన చక్కెరలు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు రోజుకు 1 నుంచి 2 కంటే ఎక్కువ తినకూడదు.
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే ఐదు సూత్రాలు..
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండెను కాపాడుకోవడానికి సమగ్ర జీవనశైలి మార్పులు అవసరం.
ట్రాన్స్ ఫ్యాట్స్ దూరం పెట్టండి..
నూనెలో వేయించిన పదార్థాలు, బేకరీ ప్రొడక్ట్స్, ఫాస్ట్ ఫుడ్స్ వాడకాన్ని పూర్తిగా తగ్గించండి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి.
పీచు పదార్థాలు (Fiber) పెంచండి..
ఓట్స్, బార్లీ, పప్పుధాన్యాలు, తాజా ఆకుకూరలు, నట్స్ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్..
గుండె ఆరోగ్యానికి మేలు చేసే వాల్నట్స్, అవిసె గింజలు (Flax seeds),చేపలను ఆహారంలో భాగంగా చేసుకోండి.
శారీరక శ్రమ ముఖ్యం..
రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన వ్యాయామం (వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్) చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ముఖ్యంగా గంటల తరబడి ఒకే చోట కూర్చునే అలవాటును (Sedentary Lifestyle) మార్చుకోవాలి. ముప్పై ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు తీవ్రంగా ఉంటే, సొంత వైద్యం చేసుకోకుండా కార్డియాలజిస్ట్ సలహా మేరకు మందులు వాడటం తప్పనిసరి.
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
