Kidney Stones : కిడ్నీలో రాళ్లకు ఈ ఆహారపు అలవాట్లతో చెక్ పెట్టొచ్చు..!
సాక్షి లైఫ్ : కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య. ఇది ఎంతో బాధాకరమైనప్పటికీ, మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నీరు ఎక్కువగా తాగాలి..
కిడ్నీ ఆరోగ్యంలో అత్యంత కీలకమైన అంశం హైడ్రేషన్. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల ద్రవ పదార్థాలను తీసుకోవాలి. వేసవి కాలంలో లేదా ఎక్కువగా చెమట పట్టే పనులు చేసేటప్పుడు మరింత ఎక్కువ నీరు తాగాలి. మూత్రం లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం తగ్గుతుంది. ఒకేసారి లీటర్ల కొద్దీ తాగడం కంటే, రోజంతా కొద్దికొద్దిగా తాగుతూ ఉండటం మంచిది.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
వీటికి దూరంగా ఉండండి..
తీపి పానీయాలు: సోడాలు, కోలా పానీయాల వల్ల మూత్రంలో క్యాల్షియం, ఆక్సలేట్,యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉప్పు ,యానిమల్ ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజుకు 2.3 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
ఆహారంలో సమతుల్యత ముఖ్యం..
ఆక్సలేట్ అధికంగా ఉండే ఫుడ్స్.. అంటే..? పాలకూర, బీట్రూట్, కొన్ని రకాల గింజల్లో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, పరిమితంగా తీసుకోవాలి. వీటిని తీసుకునేటప్పుడు పెరుగు లేదా పనీర్ వంటి క్యాల్షియం ఉన్న పదార్థాలతో కలిపి తీసుకుంటే కిడ్నీలకు రక్షణ లభిస్తుంది.
రాళ్లు ఏర్పడకుండా..
క్యాల్షియం తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడతాయనేది అపోహ మాత్రమే. పాలు, పెరుగు, రాగులు, నువ్వుల వంటి పదార్థాల ద్వారా సహజ సిద్ధమైన క్యాల్షియాన్ని శరీరానికి అందించాలి. నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లలో సిట్రేట్ ఉంటుంది. ఇది సహజంగానే రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ నిమ్మరసం తీసుకోవడం మంచి అలవాటు. చిన్నపాటి మార్పులతో పెద్ద ఫలితాలను సాధించవచ్చని, గతంలో రాళ్ల సమస్య ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహాలు పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
