Dark Circles Under Your Eyes : కళ్ల కింద నల్లటి వలయాలా..? 8 గంటలు నిద్రపోయినా తగ్గట్లేదా.. కారణం ఇదే కావచ్చు..!
సాక్షి లైఫ్ : చాలామంది కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles) అనగానే కేవలం నిద్రలేమి వల్లే అనుకుంటారు. "రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు.. అందుకే కళ్ల కింద వలయాలు నల్లబడ్డాయి" అని సరిపెట్టుకుంటారు. అయితే, రోజుకు 7 నుంచి 8 గంటల పాటు హాయిగా నిద్రపోతున్నప్పటికీ ఈ సమస్య వేధిస్తోందా..? అన్ని రకాల క్రీములు వాడినా ఫలితం కనిపించడం లేదా..? అయితే దీన్ని సాధారణ చర్మ సమస్యగా కొట్టిపారేయడానికి వీల్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఇది శరీరంలో దాగి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడానికి అసలు కారణాలు ఏంటో, అవి ఏయే అనారోగ్య సూచనలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
నిద్ర ఒక్కటే కారణం కాదు..!
వైద్య నిపుణుల ప్రకారం.. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి నిద్రలేమి ప్రధాన కారణమే అయినప్పటికీ, కేవలం దానివల్లే ఇది రాదు. దీని వెనుక మరెన్నో కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు..కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. వయస్సు పెరగడం..వయసుతో పాటు కళ్ల కింద చర్మం పల్చబడి, లోపల ఉండే రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. ఎండ ప్రభావం.. సూర్యరశ్మి ఎక్కువగా తగలడం వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరిగి నల్లగా మారుతుంది.
అలవాట్లు.. ధూమపానం (Smoking), మితిమీరిన ఒత్తిడి, తరచూ కళ్లను గట్టిగా రుద్దడం. అలర్జీలు..కళ్ల అలర్జీల వల్ల కూడా ఆ ప్రాంతం నల్లబడుతుంది.
లోపల దాగున్న అనారోగ్యాలు ఇవే కావచ్చు..!
మన శరీరంలో అత్యంత పల్చని చర్మం కళ్ల కిందనే ఉంటుంది. అందుకే శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చినా అది కళ్లపై వెంటనే ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల పోషకాహార లోపాలు, వ్యాధుల వల్ల ఇవి ఏర్పడవచ్చు.
1. రక్తహీనత (Anemia)..
కళ్ల కింద నల్లగా లేదా నీలం రంగులో వలయాలు ఏర్పడటానికి రక్తహీనత ఒక ముఖ్య కారణం. శరీరంలో ఐరన్, విటమిన్ బి12 లేదా ఫోలేట్ లోపం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఫలితంగా కళ్ల కింద నలుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. గమనించాల్సిన ఇతర లక్షణాలు..నల్లటి వలయాలతో పాటు విపరీతమైన నీరసం, తల తిరగడం, కాస్త నడవగానే ఆయాసం రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి.
2. థైరాయిడ్ సమస్యలు..
హైపోథైరాయిడిజం అంటే రక్తంలో థైరాయిడ్ హార్మోన్ లోపం.. ఉన్నవారిలో చర్మం పొడిబారడం, ముఖంపై వాపు వంటి మార్పులు వస్తాయి. దీనివల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం ఉబ్బినట్లుగా అయి, నల్లటి వలయాలు ఏర్పడతాయి.
గమనించాల్సిన ఇతర లక్షణాలు ఏమిటంటే..?
కేవలం డార్క్ సర్కిల్స్ మాత్రమే కాకుండా.. కారణం లేకుండా బరువు పెరగడం, జుట్టు విపరీతంగా రాలడం, మలబద్ధకం, చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే థైరాయిడ్ పరీక్ష అవసరమని గుర్తించాలి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి మరి..?
కళ్ల కింద వలయాలు అనేవి అందరికీ ఒకే కారణం చేత రావు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కారణాలు, చికిత్స మారుతుంటాయి. ఒకవేళ మీకు తగినంత నిద్ర ఉన్నా వలయాలు తగ్గకపోగా.. దాంతో పాటు జుట్టు రాలడం, అలసట, కళ్లలో దురద వంటి ఇతర అసాధారణ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సరైన కారణాన్ని తెలుసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
