Real Reasons Behind Body Pains : తల నుంచి అరికాలి వరకు వచ్చే నొప్పుల వెనుక అసలు కారణాలు తెలుసా..? 

షేర్ చేయండి:
Real Reasons Behind Body Pains : తల నుంచి అరికాలి వరకు వచ్చే నొప్పుల వెనుక అసలు కారణాలు తెలుసా..? 

సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఒళ్ళు నొప్పులు, అలసట సర్వసాధారణమైపోయాయి. చాలామంది వీటిని కేవలం మితిమీరిన శ్రమ అనుకుని పెయిన్ కిల్లర్లతో సరిపెట్టుకుంటారు. కానీ, శరీరం మనకు అందించే ఇటువంటి చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే.. అవి భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమరహిత జీవనశైలి, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటివి ఈ నొప్పులకు ప్రధాన కారణాలు. మరి శరీరంలోని ఏ భాగంలో నొప్పి ఎందుకు వస్తుందో, దానికి గల మూల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

శరీర భాగాలు - నొప్పుల వెనుక అంతరార్థం..

మన శరీరంలోని వివిధ భాగాలలో వచ్చే నొప్పులు వేర్వేరు ఆరోగ్య పరిస్థితులను సూచిస్తాయి. సాధారణంగా వచ్చే తలనొప్పికి మానసిక ఒత్తిడి, నిద్రలేమి, గంటల తరబడి స్క్రీన్ చూడటం లేదా రక్తపోటు పెరగడం ప్రధాన కారణాలు కావచ్చు. దీనికి తగినంత విశ్రాంతి, ధ్యానం పుష్కలంగా నీరు తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అలాగే, తీవ్రంగా వేధించే పంటి నొప్పికి పిప్పి పళ్ళు (cavities), చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు లేదా తీపి పదార్థాలను ఎక్కువగా తినడం కారణం అవుతుంది.

నోటి పరిశుభ్రతను పాటించడంతో పాటు వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించడం దీనికి సరైన మార్గం. వృద్ధాప్యం, శరీరంలో విటమిన్ డి,కాల్షియం లోపం వల్ల కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. పోషకాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, రోజులో కాసేపు ఎండలో గడపడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

ఇబ్బంది పెట్టే నడుము, భుజాల నొప్పులకు..

మరోవైపు, నేటి డిజిటల్ యుగంలో ఎక్కువమందిని ఇబ్బంది పెట్టే నడుము, భుజాల నొప్పులకు కూర్చునే భంగిమ (Posture) సరిగ్గా లేకపోవడం, బరువులు ఎత్తడం ముఖ్య కారణాలు. దీనికోసం కూర్చునే శైలిని మార్చుకోవడంతో పాటు క్రమం తప్పకుండా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. అలాగే, ల్యాప్‌టాప్‌లపై ఎక్కువసేపు టైపింగ్ చేయడం, మొబైల్ విపరీతంగా వాడటం, నరాలపై ఒత్తిడి, విటమిన్ లోపాల వల్ల చేతుల నొప్పి తలెత్తుతుంది. నిరంతరం పని చేయకుండా మధ్యమధ్యలో చేతులకు చిన్న విరామం ఇవ్వడం, తగినంత విశ్రాంతి కల్పించడం ద్వారా దీనిని అదుపు చేయవచ్చు.

ఇకపోతే, శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం, ఖనిజాల లోపం,నరాల బలహీనత వల్ల కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి సున్నితమైన మసాజ్, మంచి పౌష్టికాహారం, రోజుకు 7 నుంచి 8 గంటల తగినంత నిద్ర ఎంతో అవసరం.

యువతలో పెరుగుతున్న నడుము నొప్పులు..

ఐటీ ఉద్యోగులు, విద్యార్థులలో భుజాలు, నడుము నొప్పులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ స్క్రీన్ల ముందు తల వంచి కూర్చోవడం వల్లే కండరాలపై ఒత్తిడి పెరిగి ఈ నొప్పులు తీవ్రమవుతున్నాయి. దీనిని సకాలంలో గుర్తించి ఫిజికల్ యాక్టివిటీ పెంచకపోతే స్పాండిలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

నొప్పి అనేది మీ శరీరం మీకు పంపుతున్న ఒక హెచ్చరిక లాంటిది. సరైన ఆహారం, రోజూ కాసేపు వ్యాయామం, 7-8 గంటల నిద్రతో మెజారిటీ నొప్పులను దూరం పెట్టవచ్చు. ఒకవేళ నొప్పులు తీవ్రంగా ఉండి, తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.