Detox Water : 'డిటాక్స్ వాటర్'తో శరీరంలోని వ్యర్థాలు నిజంగానే తొలగిపోతాయా..? నిపుణులు ఏమంటున్నారు..?
సాక్షి లైఫ్ : శరీరంలోని విషతుల్య వ్యర్థాలను (toxins) బయటకు పంపేయడం, వేగంగా బరువు తగ్గడం, చర్మ సౌందర్యం మెరుగు పరుచుకోవడం కోసం ప్రస్తుతం చాలామంది 'డిటాక్స్ వాటర్' వైపు మొగ్గు చూపుతున్నారు. తాజా పండ్లు, కీరదోస, నిమ్మకాయ, పుదీనా, అల్లం వంటి పదార్థాలను నీటిలో నానబెట్టి తయారుచేసే ఈ డ్రింక్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పానీయాలు నిజంగానే శరీరాన్ని శుభ్రపరుస్తాయా..? లేక సాధారణ నీటిని రుచికరంగా మార్చుకుని తాగే పద్ధతి మాత్రమేనా..? అనే ప్రశ్నలకు వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
శరీరానికి సహజ 'డిటాక్స్' (detox)వ్యవస్థ ఉంది..!
డిటాక్స్ వాటర్ తాగడం వల్లే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయన్న ప్రచారంలో శాస్త్రీయత లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపే సహజమైన, అద్భుతమైన వ్యవస్థ ఇప్పటికే ఉంది. మన కాలేయం (liver), మూత్రపిండాలు (kidneys) ఆ పనిని నిరంతరం నిర్వర్తిస్తుంటాయి. ఏ విధమైన డిటాక్స్ డ్రింక్ కూడా వీటికి ప్రత్యామ్నాయం కాలేదు. ఇవి శరీరానికి సరిపడా నీటి శాతాన్ని అందించడానికి తోడ్పడతాయి తప్ప, ఏదో ప్రత్యేకమైన చికిత్సలా పనిచేయవని గుర్తించాలి.
పరోక్షంగా చేకూరే ప్రయోజనాలివే..
శరీరాన్ని నేరుగా డిటాక్స్ చేయకపోయినా, ఈ పానీయాల వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడం వాస్తవం..హైడ్రేషన్‌కు మేలు..చాలామందికి మామూలు నీళ్లు ఎక్కువగా తాగడం ఇష్టం ఉండదు. అలాంటివారు నిమ్మ, పుదీనా, కీరదోసతో కూడిన రుచికరమైన నీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. దీనివల్ల శరీరంలో నీటి శాతం మెరుగవుతుంది.
చక్కెర పానీయాలకు చెక్..
శీతల పానీయాలు, సోడాలు, కృత్రిమ పండ్ల రసాలకు బదులుగా డిటాక్స్ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే అనవసర క్యాలరీలు శరీరంలో చేరకుండా ఉంటాయి. నీటిలో నానబెట్టే పండ్లు, ఆకుల నుంచి స్వల్ప పరిమాణంలో విటమిన్లు అందుతాయి. తగినంత నీరు తాగడం వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
బరువు తగ్గుతారా..? వాస్తవమేంటి..?
డిటాక్స్ వాటర్ తాగగానే కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారనే ప్రచారం అవాస్తవం. అధిక క్యాలరీలు ఉండే శీతల పానీయాలకు బదులు చక్కెర లేని డిటాక్స్ వాటర్ తీసుకున్నప్పుడు శరీరంలోకి చేరే క్యాలరీల పరిమాణం తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణకు పరోక్షంగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, స్వయంగా కొవ్వును కరిగించే మంత్రదండమేమీ కాదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మరి..?
రుచి కోసం డిటాక్స్ వాటర్‌లో చక్కెర లేదా తేనె ఎక్కువగా కలిపితే క్యాలరీలు పెరిగిపోయి బరువు తగ్గాలనే లక్ష్యం దెబ్బతింటుంది. నిమ్మ లేదా ఇతర సిట్రస్ జాతి పండ్లను అధికంగా వాడితే సున్నితమైన కడుపు ఉన్నవారిలో అసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. ఏదేమైనా సమతులాహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర మాత్రమే ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది. డిటాక్స్ డ్రింక్స్‌ను వాటికి ప్రత్యామ్నాయంగా భావించకూడదు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
