Hernia :హెర్నియాకు సంకేతమా..? ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం అవ్వాల్సిందే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కడుపులో నొప్పి రావడం అనేది సర్వసాధారణం. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం లేదా కండరాల అసాధారణ అలికిడి వల్ల కడుపునొప్పి వస్తుంటుంది. అయితే, నొప్పితో పాటు పొత్తికడుపు లేదా గజ్జల భాగంలో ఏదైనా ఉబ్బెత్తుగా గడ్డలా అనిపిస్తే మాత్రం దాన్ని సాధారణ కడుపునొప్పిగా కొట్టిపారేయకూడదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అది 'హెర్నియా' (Hernia) కు సంకేతం కావొచ్చు. హెర్నియా అనేది ప్రారంభంలో పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది. అసలు హెర్నియా అంటే ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

హెర్నియా అంటే ఏమిటి..?

మన పొత్తికడుపు గోడల కండరాలు ఎక్కడైనా బలహీనంగా ఉన్నప్పుడు.. ఆ ఖాళీ లేదా బలహీనమైన ప్రదేశం గుండా పేగులు లేదా కొవ్వు కణజాలం చర్మాన్ని తోసుకుంటూ బయటకు చొచ్చుకురావడాన్ని 'హెర్నియా' అంటారు. చాలా కాలం పాటు ఇది ఎలాంటి లక్షణాలను చూపించకపోవచ్చు. కానీ, బయటకు వచ్చిన పేగు భాగం అక్కడే ఇరుక్కుపోయి, దానికి రక్తప్రసరణ ఆగిపోతే మాత్రం అది అత్యవసర వైద్య పరిస్థితికి (medical emergency) దారితీస్తుంది.

ఈ సమస్య ఎందుకు వస్తుంది..?

కండరాల బలహీనత..పుట్టుకతోనే కడుపు కండరాలు బలహీనంగా ఉండటం లేదా వయసు పెరిగే కొద్దీ కణజాలం పటుత్వం కోల్పోవడం.

మలబద్ధకం..దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు మలవిసర్జన సమయంలో ఎక్కువగా ముక్కడం వల్ల పొత్తికడుపుపై ఒత్తిడి పెరుగుతుంది.

ఇతర కారణాలు.. ఎడతెగని దగ్గు, బరువైన వస్తువులను తరచూ ఎత్తడం, ఊబకాయం (excess weight), ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు ఉన్నవారిలో ఈ వ్యాధి ముప్పు ఎక్కువ.

హెర్నియాను పసిగట్టే లక్షణాలు ఇవే..

అన్ని కడుపు నొప్పులు హెర్నియా కాకపోవచ్చు. ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి..అవేంటంటే..? పొత్తికడుపు లేదా గజ్జల ప్రాంతంలో గడ్డలా ఉబ్బెత్తుగా రావడం.దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఏదైనా బరువు ఎత్తినప్పుడు ఆ ఉబ్బెత్తు భాగం మరింత స్పష్టంగా కనిపించడం. బరువులు ఎత్తేటప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి లేదా భారం అనిపించడం. ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఇబ్బందిగా అనిపించ డం, పడుకోగానే నొప్పి తగ్గిపోవడం లేదా ఆ ఉబ్బెత్తు భాగం లోపలికి వెళ్లిపోవడం. గజ్జల ప్రాంతంలో మంట లేదా కండరాలు లాగుతున్నట్లు అనిపించడం.

అలర్ట్ అవ్వాల్సిన సమయం..

బయటకు వచ్చిన హెర్నియా గడ్డ హఠాత్తుగా పెద్దదిగా మారినా.. భరించలేని కడుపునొప్పి, జ్వరం, కడుపు ఉబ్బరం, విపరీతమైన వాంతులు అవుతున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి. పేగు ఇరుక్కుపోయి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది అత్యంత ప్రాణాంతక పరిస్థితి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

హెర్నియా రాకుండా ఉండాలన్నా, లేదా పొత్తికడుపు కండరాలపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలన్నా.. బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే మలబద్ధకం దరిచేరకుండా ఉండేందుకు పీచుపదార్థాలు (fiber) ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. బరువులు ఎత్తేటప్పుడు సరైన భంగిమను పాటించాలి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.