Flaxseeds Health Benefits : అవిసె గింజలు ఇలా తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకునే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఈ క్రమంలో 'అవిసె గింజలు' (flax seeds) అత్యుత్తమ సూపర్‌ఫుడ్‌గా గుర్తింపు పొందుతున్నాయి. అయితే, వీటిని పచ్చిగా కంటే పెనంపై దోరగా వేయించి తినడం వల్ల రుచి పెరగడమే కాకుండా, సులభంగా జీర్ణమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే వేయించిన అవిసె గింజలతో కలిగే ప్రయోజనాలెన్నో..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
గుండె ఆరోగ్యానికి అండగా..
వేయించిన అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, లిగ్నన్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరిగేలా చేస్తాయి. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు..
అవిసె గింజల్లోని పీచు (fiber) పేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని వేయించి తినడం వల్ల కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపించే సమస్య కూడా తలెత్తదు.
బరువు నియంత్రణలో సహాయకారి..
బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఆహారం. దీనిలోని పీచు పదార్థం కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉంచుతుంది. ఫలితంగా పదేపదే ఆకలి వేయడం, అనవసరంగా ఎక్కువ తినడం (overeating) వంటివి తగ్గుతాయి.
రక్తంలో చక్కెర అదుపులో..
వేయించిన అవిసె గింజలు రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో తోడ్పడతాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేయడం వల్ల, తిన్న వెంటనే షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోకుండా కాపాడతాయి.
చర్మం, కురుల సంరక్షణకు..
వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి తేమను అందించి, ముడతలు తగ్గేలా చేస్తాయి. చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తాయి. అలాగే జుట్టు కుదుళ్లకు పోషణ అందించి, జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, కురులు ఒత్తుగా, మెరుస్తూ ఉండేలా చూస్తాయి.
హార్మోన్ల సమతుల్యత.. రోగనిరోధక శక్తి..
అవిసె గింజల్లోని 'లిగ్నన్స్' హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ముఖ్యంగా మహిళలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా, వీటిలోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.
ఎలా తీసుకోవాలి అంటే..?
రోజూ ఒకటి నుంచి రెండు చెంచాల అవిసె గింజలను పెనంపై దోరగా వేయించి నేరుగా తినవచ్చు. వీటిని సలాడ్లు, పెరుగు, ఓట్స్ లేదా స్మూతీలలో కలుపుకొని తీసుకోవచ్చు. కావాలనుకుంటే వేయించిన గింజలను పొడిగా చేసి, కూరల్లో లేదా మజ్జిగలో కలుపుకొని కూడా వాడుకోవచ్చు. అవిసె గింజల్లో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో చేర్చుకున్నప్పుడు రోజంతా తగినంత నీరు తాగాలి లేదంటే డీహైడ్రేషన్ అవుతుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
