వింటర్ సీజన్ లో కీళ్లనొప్పులకు కారణాలు..?

సాక్షి లైఫ్ : వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. కొందరికి చలికాలంలో కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చలికాలంలో కీళ్ల నొప్పుల నుంచి, ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు. 

వింటర్ సీజన్ లో చలి తీవ్రత పెరగడంవల్ల ఆ ప్రభావం ఎముకలపై పడుతుంది. చల్లదనానికి కీళ్ల మధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్‌ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు కూడా బిగుసుకుపోతాయి. అందుకే చాలామందికి చలికాలంలో కీళ్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ల నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. చలికాలంలో వచ్చే సాధారణ కీళ్ల నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు.

ఫిజియోథెరపీ వ్యాయామాలు..

అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తుండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్ల కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చలికాలంలో డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ బలహీనంగా ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు క్యాల్షియం, విటమిన్‌ "డి" మాత్రలు వేసుకోవచ్చు. ఇక వీటితో పాటు చలికాలంలో జంక్‌ ఫుడ్‌ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.

ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్‌–డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు మందపాటి బట్టలు వేసుకోవాలి. శరీరాన్ని చలికి ఎక్స్‌పోజ్‌ అవ్వకుండా చూసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందకపోవడం వల్ల విటమిన్‌ "డి" లోపం ఏర్పడుతుంది. విటమిన్‌–డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్‌ "డి" సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. సల్ఫర్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే..

కీళ్ల నొప్పులున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మరీ మంచిది.చలికాలంలో మనకు తెలియకుండానే తక్కువ నీటిని తీసుకుంటాం కాబటి బాడీ డీహైడ్రేషన్‌ కు గురవుతుంది. దానివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అందువల్ల అది గుర్తుంచుకుని కీళ్లనొప్పులతో బాధపడేవారు శరీరం డీహైడ్రేట్‌ కాకుండా తగినంత నీళ్లు తాగడం ఉత్తమం. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : arthritis-pain

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com