Kidney Damage : మూత్రపిండాలు దెబ్బతినే ముందు కనిపించే సంకేతాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేయడం, మలినాలను బయటకు పంపడం, ద్రవాలు మరియు ఖనిజాల సమతుల్యతను కాపాడటంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే, ఆధునిక జీవనశైలి, తప్పు ఆహారపు అలవాట్లు, అదుపులో లేని మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల వల్ల కిడ్నీల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది.

కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలో గుర్తించడం కాస్త కష్టమే. ఎందుకంటే 60 శాతం మేర కిడ్నీలు దెబ్బతినే వరకు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు బయటపడవు. అయితే, మన శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు సంకేతాలను పసిగడితే ముప్పు నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే కనిపించే ఈ కింది ఐదు లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 

1. కళ్ల కింద, ముఖం వాపు.. 

ఉదయం నిద్రలేవగానే మీ ముఖం లేదా కళ్ల కింద ఉబ్బినట్లుగా  అనిపిస్తే అది కిడ్నీ సమస్యలకు ప్రారంభ సంకేతం కావచ్చు. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు అవి శరీరంలోని అదనపు నీటిని, సోడియంను సరిగ్గా ఫిల్టర్ చేసి బయటకు పంపలేవు. దీనివల్ల శరీరంలో ద్రవాలు పేరుకుపోయి ముఖం ఉబ్బుతుంది.

2. మూత్ర విసర్జనలో మార్పులు.. 

కిడ్నీల్లో లోపం తలెత్తినప్పుడు మూత్ర విసర్జనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం ప్రధాన లక్షణం. అలాగే మూత్రం ఎక్కువగా నురుగుగా రావడం ఎందుకంటే ప్రోటీన్ లీక్ అవ్వడం వల్ల. లేదా రంగు మారడం వంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

3. పాదాలు, చీలమండల వద్ద వాపు..

మూత్రపిండాలు సక్రమంగా పనిచేయనప్పుడు శరీరంలో అదనపు ద్రవాలు నిలిచిపోతాయి. గురుత్వాకర్షణ కారణంగా ఈ ద్రవాలు కిందికి చేరి పాదాలు, చీలమండలు, కొన్నిసార్లు చేతుల వద్ద వాపునకు దారితీస్తాయి. ఈ వాపు సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

4. తీవ్రమైన అలసట, నీరసం.. 

ఆరోగ్యకరమైన కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఇది ఎర్ర రక్త కణాల తయారీకి సహాయపడుతుంది. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు రక్తహీనత తలెత్తుతుంది. అంతేకాకుండా, రక్తంలో విషతుల్యాలు (Toxins) పేరుకుపోతాయి. దీనివల్ల ఉదయం తగినంత నిద్రపోయి లేచిన తర్వాత కూడా శరీరం బరువుగా, తీవ్రమైన అలసటగా, శక్తి లేనట్లుగా అనిపిస్తుంది.

5. చర్మం పొడిబారడం, తీవ్రమైన దురద.. 

రక్తంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను ఎప్పటికప్పుడు తొలగించి ఎముకలను దృఢంగా ఉంచడంలో కిడ్నీలు సాయపడతాయి. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు రక్తంలో ఖనిజాలు, పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొడిబారడం, తీవ్రమైన దురద, పగుళ్లు, చికాకు వంటి సమస్యలు వేధిస్తాయి.

కిడ్నీలను పదిలంగా ఉంచుకోవాలంటే..

నీరు తగినంత తాగాలి: రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల కిడ్నీల్లోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.

ఉప్పు తగ్గించాలి..ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. నిల్వ పచ్చళ్లు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

బీపీ, షుగర్ కంట్రోల్..రక్తపోటు (bp), మధుమేహం (diabetes) అదుపు తప్పితే కిడ్నీలపై నేరుగా ప్రభావం పడుతుంది. కాబట్టి వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.

పెయిన్ కిల్లర్స్‌తో జాగ్రత్త..చిన్న చిన్న నొప్పులకే వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారం పెయిన్ కిల్లర్స్ వాడటం కిడ్నీలకు అత్యంత ప్రమాదకరం.

జీవనశైలి మార్పులు.. పోషక విలువలున్న సమతుల్య ఆహారం తీసుకుంటూ, బరువు పెరగకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆందోళన చెందకుండా, కిడ్నీల పనితీరును తెలుసుకునేందుకు వైద్యుల సూచన మేరకు కేఎఫ్‌టీ (KFT), యూరిన్ కంప్లీట్ ఎగ్జామినేషన్ వంటి సాధారణ పరీక్షలు చేయించుకోవాలి.

 

ఇది కూడా చదవండి..Weight loss : ఇంట్లోనే చేసే 4 సింపుల్ వ్యాయామాలతో రోజుకు కేవలం 10 నిమిషాలు.. 8 నెలల్లో 34 కిలోలు తగ్గిన గృహిణి..! 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.