Hyponatremia : హైపోనెట్రీమియా అంటే ఏమిటి..? ఇది ప్రాణాంతకమైనదా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది ఆహారంలో ఉప్పును ఉన్నపళంగా పూర్తిగా తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చేస్తుంటారు. రక్తపోటు (bp), గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి వైద్యులు ఉప్పు వాడకం తగ్గించమని సూచించడం సహజమే. అయితే, అవసరానికి మించి ఉప్పును తగ్గించేస్తే రక్తంలో సోడియం స్థాయులు పడిపోయి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య పరిభాషలో శరీరంలో సోడియం మోతాదు ప్రమాదకరంగా తగ్గడాన్ని హైపోనెట్రీమియా (Hyponatremia) అంటారు.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
శరీరానికి సోడియం ఎందుకు అవసరం..?
శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి, నరాల పనితీరు సజావుగా సాగడానికి, కండరాలు సరిగ్గా స్పందించడానికి సోడియం అత్యంత కీలకమైన ఎలక్ట్రోలైట్. రక్తంలో దీని పరిమాణం పెరిగితే ఎంత సమస్యో, ఉండాల్సిన దానికంటే తగ్గినా అంతే ముప్పు. సాధారణ స్థాయి..రక్తంలో సోడియం సాధారణంగా 136 నుంచి 144 mEq/L మధ్య ఉండాలి. 125 నుంచి 129 mEq/L కు పడిపోతే అప్రమత్తం కావాలి. 125 mEq/L కంటే తగ్గితే శరీర కణాల్లో నీటి సమతుల్యత దెబ్బతిని అత్యవసర చికిత్స అవసరమవుతుంది.
సోడియం లోపిస్తే కనిపించే ప్రధాన లక్షణాలు..
శరీరంలో సోడియం నెమ్మదిగా తగ్గినప్పుడు స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఆకస్మికంగా పడిపోతే అది నేరుగా నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నీరసం, తలనొప్పి, వికారం, కండరాల బలహీనత, తిమ్మిర్లు, కళ్లు తిరగడం. గందరగోళం, మానసిక అస్థిరత, మతిమరుపు, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం. రక్తంలో సోడియం మరీ కనిష్ఠ స్థాయికి పడిపోతే మెదడు వాపు వచ్చి ఫిట్స్ రావడం లేదా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ముప్పు ఎవరిలో ఎక్కువ..?
గుండె, కాలేయం, కిడ్నీ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు. రక్తపోటు నియంత్రణ కోసం వాటర్ పిల్స్ (diuretics) వంటి కొన్ని నిర్దిష్ట మందులు వాడేవారు. తీవ్రమైన వాంతులు, విరేచనాల వల్ల శరీరంలో ద్రవాలు అధికంగా కోల్పోయినవారు. వృద్ధులలో ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆహారంలో ఉప్పు పరిమాణం ఎంత ఉండాలనేది శరీర తత్వాన్ని, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను బట్టి మారుతుంది. హై బీపీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సొంత నిర్ణయాలతో ఉప్పును పూర్తిగా మానడం కాకుండా, నిపుణులైన వైద్యులు లేదా డైటీషియన్ల సలహా మేరకే రోజువారీ ఉప్పు వినియోగాన్ని నియంత్రించుకోవాలి. అకారణంగా నిరంతర నీరసం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
