Breast Cancer : చికిత్స పూర్తయినా రొమ్ము క్యాన్సర్ మళ్లీ వస్తుందా..? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
సాక్షి లైఫ్ : రొమ్ము క్యాన్సర్ (breast cancer survivors) బారినపడి విజయవంతంగా చికిత్స పూర్తి చేసుకున్న బాధితులను, వారి కుటుంబసభ్యులను నిరంతరం వేధించే ప్రధాన ఆందోళన.. 'ఈ మహమ్మారి మళ్లీ తిరగబెడుతుందా..?' అని. వైద్య పరిభాషలో దీనిని 'క్యాన్సర్ రికరెన్స్' (cancer recurrence) అంటారు. అయితే, చికిత్స తీసుకున్న ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్ మళ్లీ రావాలని లేదు. వ్యాధి నిర్ధారణ జరిగిన దశ, క్యాన్సర్ రకం, కణితి పరిమాణం తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. అసలు రొమ్ము క్యాన్సర్ మళ్లీ ఎందుకు వస్తుంది..? ఎవరిలో ముప్పు ఎక్కువ..? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
క్యాన్సర్ మళ్లీ ఎందుకు తిరగబెడుతుంది..?
సర్జరీ, కీమోథెరపీ లేదా రేడియేషన్ వంటి చికిత్సలు పూర్తయిన ప్పటికీ, కొన్ని సూక్ష్మమైన క్యాన్సర్ కణాలు శరీరంలో ఉండిపోవచ్చు. ఇవి స్కానింగ్ లేదా రక్త పరీక్షల్లో కనిపించనంత సూక్ష్మంగా ఉండి, కొన్ని నెలలు లేదా ఏళ్లపాటు నిద్రాణంగా (inactive) ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి మళ్లీ పెరగడం ప్రారంభిస్తాయి. కొన్ని సందర్భాల్లో కణాలు చికిత్సను తట్టుకునే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల కూడా సమస్య మళ్లీ తలెత్తవచ్చు.
ఎవరిలో ముప్పు ఎక్కువ..?
క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశాలు అందరిలో ఒకేలా ఉండవు. కింది పరిస్థితులు ఉన్నవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముదిరిన దశ.. క్యాన్సర్ 3 లేదా 4వ దశలో బయటపడినప్పుడు. లింఫ్ నోడ్స్..చంకల్లోని లింఫ్ నోడ్స్‌కు క్యాన్సర్ కణాలు వ్యాపించి ఉంటే. ట్యూమర్ పరిమాణం పెద్దదిగా ఉండటం లేదా హై-గ్రేడ్ రకానికి చెందినది కావడం. ట్రిపుల్ నెగెటివ్ క్యాన్సర్..ఈ తరహా క్యాన్సర్‌లలో కణాలు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఎక్కువ.
తక్కువ వయస్సు.. చిన్న వయస్సులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడటం. ఊబకాయం.. అధిక బరువు, జీవనశైలి లోపాలు కూడా పునరావృత ముప్పును పెంచుతాయి.
క్యాన్సర్ చికిత్స ముగిసిన తర్వాత అది తిరిగి వచ్చే ప్రాంతాన్ని బట్టి రికరెన్స్‌ను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. మొదటిది స్థానిక రికరెన్స్ ,ఇందులో క్యాన్సర్ గతంలో శస్త్రచికిత్స జరిగిన చోటే లేదా రొమ్ము, ఛాతీ గోడ పరిసర భాగాల్లోనే మళ్లీ బయటపడుతుంది. రెండవది ప్రాంతీయ రికరెన్స్ ,ఇది ప్రాథమిక కణితి ఉన్న ప్రదేశానికి సమీపంలోని చంకలు లేదా కాలర్ బోన్ దగ్గర ఉండే లింఫ్ నోడ్స్‌లో కణాలు మళ్లీ వృద్ధి చెందడం వల్ల వస్తుంది. మూడవది, అత్యంత తీవ్రమైనది దూరస్థ రికరెన్స్ (metastatic recurrence), ఇందులో క్యాన్సర్ కణాలు రక్తప్రసరణ లేదా శోషరస వ్యవస్థ ద్వారా ప్రయాణించి ఎముకలు, ఊపిరితిత్తులు, కాలేయం లేదా మెదడు వంటి శరీరంలోని ఇతర ముఖ్యమైన సుదూర అవయవాలకు వ్యాపిస్తాయి.
ఏళ్ల తర్వాత కూడా రావొచ్చా..?
అవును. సాధారణంగా చికిత్స పూర్తయిన మొదటి 2 నుంచి 5 ఏళ్లలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే హార్మోన్ పాజిటివ్ తరహా క్యాన్సర్లలో చికిత్స ముగిసిన 10,15 ఏళ్ల తర్వాత కూడా క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరం.
విస్మరించకూడని హెచ్చరిక లక్షణాలు
శస్త్రచికిత్స జరిగిన ప్రాంతంలో లేదా చంకల్లో కొత్తగా గడ్డలు ఏర్పడటం. చర్మంపై మార్పులు, ఎరుపుదనం, పుండ్లు మానకపోవడం. శరీరంలో లేదా ఎముకల్లో తగ్గని తీవ్రమైన నొప్పి. ఎడతెగని దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆకలి తగ్గడం, ఆకస్మికంగా బరువు తగ్గడం.
ముప్పును తగ్గించే జాగ్రత్తలు..
క్యాన్సర్ మళ్లీ రాకుండా నూటికి నూరు శాతం అడ్డుకోవడం సాధ్యం కాకపోయినా, కొన్ని పద్ధతుల ద్వారా ఆ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. క్రమం తప్పని ఫాలో-అప్: వైద్యులు నిర్దేశించిన సమయానికి మామోగ్రామ్, అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలి. మందుల నియమం..హార్మోన్ థెరపీ మందులను డాక్టర్ సూచించిన కాలపరిమితి వరకు క్రమం తప్పకుండా వాడాలి. బరువు నియంత్రణ..అధిక బరువును తగ్గించుకోవడం ద్వారా ఈస్ట్రోజెన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆరోగ్యకర జీవనశైలి..తాజా కూరగాయలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ముఖ్యం.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
