Menopause effect : మహిళలూ.. హెచ్‌ఆర్‌టీతో జాగ్రత్త ..! శృతి మించితే ప్రాణాంతకమే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల జీవితంలో మెనోపాజ్ (Menopause) అనేది ఒక సహజమైన మార్పు. ఈ దశలో ఎదురయ్యే తీవ్రమైన శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది 'హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT)' వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, సరైన వైద్య సలహా లేకుండా, సోషల్ మీడియా ప్రభావంతో దీనిని ఇష్టారీతిన వాడటం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడుతున్నారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

 

చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

మెనోపాజ్(Menopause) అంటే ఏమిటి..? ఎందుకీ థెరపీ..?

సాధారణంగా భారతదేశంలో మహిళలకు 45 నుంచి 55 ఏళ్ల మధ్య రుతుక్రమం శాశ్వతంగా ఆగిపోతుంది. వరుసగా 12 నెలల పాటు నెలసరి రాకపోతే దానిని 'మెనోపాజ్'గా పరిగణిస్తారు.

లక్షణాలు..

ఈ దశలో శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల వేడి ఆవిర్లు (hot flashes), రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, నిద్రలేమి, మానసిక ఆందోళన (mood swings), యోని పొడిబారడం వంటి సమస్యలు వేధిస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బులు, ఆర్థరైటిస్ ముప్పు కూడా పెరుగుతుంది.

పరిష్కారంగా హెచ్‌ఆర్‌టీ..

శరీరంలో తగ్గిపోయిన ఈ హార్మోన్లను కృత్రిమంగా భర్తీ చేసి, పై సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకే వైద్యులు 'హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ'ని సూచిస్తుంటారు.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు..

ఇటీవలి కాలంలో మెనోపాజ్ కష్టాలను అధిగమించేందుకు హెచ్‌ఆర్‌టీ వాడే మహిళల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. యూకే జాతీయ ఆరోగ్య సేవల (NHS) రికార్డుల ప్రకారం..2020-21 సంవత్సరంలో 40 ఏళ్లు పైబడిన సుమారు 8 లక్షల మంది మహిళలు హెచ్‌ఆర్‌టీ తీసుకున్నారు. అదే 2025-26 నాటికి ఈ సంఖ్య రికార్డు స్థాయిలో 20 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఐదేళ్లలో ఈ థెరపీ వినియోగం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది.

పొంచి ఉన్న ప్రాణాంతక దుష్ప్రభావాలు..

నిర్ణీత మోతాదులో, సరైన వైద్య పర్యవేక్షణలో వాడితే మేలు చేసే హెచ్‌ఆర్‌టీ.. మితిమీరితే మాత్రం తీవ్రమైన ముప్పు తెస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రొమ్ము క్యాన్సర్..

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ రెండూ కలిపి తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. థెరపీ తీసుకునే కాలవ్యవధి (Duration) పెరిగేకొద్దీ ఈ ముప్పు పెరుగుతుంది. అయితే, థెరపీ ఆపేసిన తర్వాత ఈ ప్రమాదం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

గర్భాశయ క్యాన్సర్..

 హార్మోన్ల మోతాదులో సమతుల్యత లోపించినా, అవసరానికి మించి డోసు వాడినా గర్భాశయ లోపలి పొర (ఎండోమెట్రియం) మందంగా మారుతుంది. దీనివల్ల అసాధారణ రక్తస్రావం జరిగి, భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.

స్ట్రోక్ ముప్పు..

ఈ థెరపీ వల్ల కొన్ని సందర్భాల్లో పక్షవాతం (stroke) వచ్చే ప్రమాదం కూడా పెరగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సోషల్ మీడియా సలహాలు.. ప్రాణాల మీదకు..!

సోషల్ మీడియా పుణ్యమా అని మహిళలు మెనోపాజ్ గురించి, తమ ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుకోవడం మంచి పరిణామమే అయినా, కొందరు ఇచ్చే ఉచిత సలహాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయని గైనకాలజిస్ట్లుఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసిక సమస్యలను అదుపు చేయడానికి హెచ్‌ఆర్‌టీ సాధారణ డోసు కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా వాడాలని కొందరు 'ఇన్‌ఫ్లుయెన్సర్లు' సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని ఇటువంటి వీడియోలు చూసి మందులు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది. మెనోపాజ్ అనేది ఒక సహజ ప్రక్రియ. ప్రతి మహిళా శరీరం దీనికి ఒకేలా స్పందించదు. కాబట్టి, సమస్యలు తీవ్రంగా ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా, తప్పనిసరిగా నిపుణులైన గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి సూచనల మేరకే నడుచుకోవాలి.

 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.