Anemia : అమీమియా కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సరికొత్త వ్యూహం..
సాక్షి లైఫ్ : దేశంలో వేగంగా విస్తరిస్తున్న పోషకాహార లోపం, రక్తహీనత (Anemia) సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. నిత్యం మనం తీసుకునే నిత్యావసర ఆహార పదార్థాల ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిశ్చయించింది. ఇందులో భాగంగానే పిండి, బియ్యం, వంటనూనెలు, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలను పోషకాలతో ‘బలవర్ధకం’ (ఫోర్టిఫికేషన్) చేసేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది.
ఈ అంశంపై ఇటీవల న్యూఢిల్లీలో వివిధ రంగాల నిపుణులతో ఒక జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో టెక్నోసర్వ్ సంస్థ నడుపుతున్న 'మిల్లర్స్ ఫర్ న్యూట్రిషన్', కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) పరిధిలోని 'ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
‘దాగివున్న ఆకలి’తోనే ముప్పు..!
ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల ద్వారా ప్రజలందరికీ తగినంత ఆహారం అందుతున్నప్పటికీ.. వారి శరీరానికి అవసరమైన ఇనుము, విటమిన్లు, ఇతర సూక్ష్మపోషకాలు అందడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరిభాషలో దీనిని ‘హిడెన్ హంగర్ గా పిలుస్తారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత పెరగడానికి, రోగనిరోధక శక్తి తగ్గడానికి ఇదే ప్రధాన కారణమవుతోంది. నిత్యం వాడే నిత్యావసరాల్లో తగినంత పోషక విలువలు లేకపోవడంతో ఈ ముప్పు మరింత హెచ్చుతోంది.
ఆందోళన కలిగిస్తున్న జాతీయ సర్వే గణాంకాలు..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం దేశంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం (స్టంటింగ్): 35.5 శాతం
ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం (వేస్టింగ్): 19.3 శాతం
తక్కువ బరువుతో ఉండటం: 32.1 శాతం
యూనిసెఫ్ నివేదికల ప్రకారం.. దేశంలో అత్యధిక శాతం మంది పిల్లలు పుట్టుకతోనే తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. దీనివల్ల వారు శారీరక, మానసిక ఎదుగుదల లోపాలతో చిన్న వయసులోనే పోషకాహార లోపం బారిన పడుతున్నారు.
బలవర్ధకమైన ఆహారం..
ఈ పరిస్థితిని అధిగమించడానికి 'బలవర్ధకమైన ఆహారం'అత్యుత్తమ మార్గమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. బియ్యం, గోధుమపిండి, నూనె, పాలు, ఉప్పు వంటి నిత్యవసరాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, విటమిన్-డి వంటి అదనపు పోషకాలను చేర్చడం ద్వారా తక్కువ ఖర్చుతోనే సమాజంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఈ ప్రక్రియ ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు, పిల్లల్లో పోషకాహార స్థాయిలను వేగంగా మెరుగుపరుస్తుందని విశ్వసిస్తున్నారు.
ప్రభుత్వం ముందడుగు..
బలవర్ధక ఆహారాల (Fortified Foods) పరిధిని దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని, కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు. ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని సూచించారు. ప్రభుత్వం సైతం ఈ దిశగా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని, త్వరలోనే క్షేత్రస్థాయిలో మరిన్ని సానుకూల మార్పులు రానున్నాయని సదస్సు వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
