Selenium Deficiency : గర్భిణులు, బాలింతల్లో సెలీనియం డెఫిసెన్సీ.. సప్లిమెంట్లు వాడినా ఫలితం తక్కువేనంటున్న పరిశోధకులు..!
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత బాలింత దశలోను మహిళలు తీవ్రమైన 'సెలీనియం' (Selenium) లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, గ్వాటెమాలా వంటి దేశాల్లోని మహిళలపై అమెరికాకు చెందిన 'యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో', 'యూఎస్‌డీఏ అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్' శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గర్భిణులకు సెలీనియం సప్లిమెంట్లు అందించినప్పటికీ, వారి రక్తంలో సెలీనియం స్థాయిలు ఆశించిన స్థాయిలో పెరగలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
గర్భధారణలో సెలీనియం ఎందుకు ముఖ్యం..?
సెలీనియం అనేది శరీరానికి అత్యంత అవసరమైన ఒక సూక్ష్మపోషకం (Trace Element). ఇది గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది. తల్లి శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా పనిచేయడానికి సెలీనియం ఎంతో కీలకం. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో శిశువు మెదడు ఎదుగుదల, శారీరక పెరుగుదల పూర్తిగా తల్లి థైరాయిడ్ పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి.
గర్భిణుల్లో సెలీనియం లోపిస్తే.. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (Gestational Diabetes), అధిక రక్తపోటు (Pre-eclampsia), మరియు తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. బాలింతల లో సెలీనియం తగినంత ఉంటేనే, అది తల్లి పాల ద్వారా శిశువుకు అందుతుంది. ఇది శిశువు ఎదుగుదలకు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది.
పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు..
పరిశోధనలో భాగంగా గర్భిణులకు రోజువారీ అవసరానికి మించి (130 మైక్రోగ్రాముల) సెలీనియం సప్లిమెంట్లను అందించారు. అయినప్పటికీ వారి రక్తంలో సెలీనియం మోతాదు పెరగలేదు. గర్భం దాల్చిన 12వ వారం నుంచి ప్రసవానంతరం 3 నెలల వరకు మహిళల రక్త నమూనాలను పరీక్షించగా.. ప్రసవం తర్వాత 3 నెలలకు వారిలో సెలీనియం స్థాయిలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు గుర్తించారు.
శోషణ సామర్థ్యం తక్కువగా ఉండటమే కారణమా..?
ఈ అధ్యయనంలో పరిశోధకులు 'ఇనార్గానిక్ సెలీనియం'ను ఉపయోగించారు. అయితే దీనికంటే 'ఆర్గానిక్ సెలీనియం'ను శరీరం సులభంగా గ్రహిస్తుందని, భవిష్యత్తులో దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం..
మనం తినే ఆహారంలో సెలీనియం స్థాయిలు అనేవి ఆయా ప్రాంతాల్లోని నేలలో ఉండే సెలీనియం పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాతావరణ మార్పుల (Climate change) వల్ల రాబోయే రోజుల్లో నేలలో సెలీనియం శాతం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ లోపం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
గర్భిణులు, బాలింతలలో ఈ లోపాన్ని అధిగమించడానికి కేవలం సప్లిమెంట్లపైనే ఆధారపడకుండా.. నాణ్యమైన, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు తమ శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ల కోసం వైద్యుల సలహా మేరకు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
