ICMR Warns : యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా.. సొంత వైద్యంతో పెను ముప్పు..! ఐసీఎంఆర్ కీలక హెచ్చరిక..
సాక్షి లైఫ్ : జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్య సమస్యలు రాగానే వైద్యులను సంప్రదించకుండానే నేరుగా మందుల దుకాణాలకు వెళ్లి యాంటీబయాటిక్స్ తెచ్చుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే, ఈ తీరు మన ఆరోగ్యానికి పెను ప్రమాదంగా పరిణమిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజా నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మనం ఎంతో నమ్మకంగా వాడే యాంటీబయాటిక్ మందులు ఇప్పుడు బ్యాక్టీరియాపై పనిచేయడం లేదని, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల సమయంలో అవి విఫలమవుతున్నాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
సాధారణ ఇన్ఫెక్షన్లకూ పనిచేయని మందులు..
ఐసీఎంఆర్‌కు చెందిన ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్’ తన 2025 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులోని గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), న్యుమోనియా వంటి సమస్యలకు సాధారణంగా వాడే ‘సెఫోటాక్సిమ్’ (Cefotaxime) అనే మందు ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ఆసుపత్రుల్లో సేకరించిన ‘ఈ.కోలి’ (E. coli) బ్యాక్టీరియా నమూనాలపై ఈ మందును పరీక్షించగా, కేవలం 18.4 శాతం కేసుల్లో మాత్రమే అది ఇన్ఫెక్షన్ను అరికట్టగలిగింది.
చివరి అస్త్రాలూ చేతులెత్తేస్తున్నాయి..!
వైద్య రంగంలో ఇతర మందులేవీ పనిచేయని అత్యవసర పరిస్థితుల్లో ‘కార్బపెనెమ్స్’ (Carbapenems) వంటి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ను చివరి అస్త్రంగా ఉపయోగిస్తారు. కానీ, ఇప్పుడు ఈ మందుల ప్రభావం కూడా సన్నగిల్లుతోందని నివేదిక తేల్చింది.
క్లెబ్సియెల్లా న్యుమోనియా.. ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియాపై కార్బపెనెమ్స్ మందులు కేవలం మూడో వంతు (సుమారు 33 శాతం) కేసుల్లోనే ప్రభావం చూపుతున్నాయి.
ఎసినెటోబాక్టర్ బామని.. ఐసీయూలో చికిత్స పొందే రోగుల్లో న్యుమోనియా, రక్త ఇన్ఫెక్షన్లకు ఈ బ్యాక్టీరియా కారణమవుతుంది. పరీక్షించిన నమూనాల్లో ఏకంగా 91.1 శాతం కేసుల్లో ఈ బ్యాక్టీరియాపై కార్బపెనెమ్స్ మందులు ఏమాత్రం పనిచేయడం లేదని వెల్లడైంది.
చిన్న ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి..
యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం (యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్) కేవలం పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన సమస్య కాదని ఐసీఎంఆర్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్ విభాగం అధిపతి డాక్టర్ కామిని వాలియా స్పష్టం చేశారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ‘ఈ.కోలై’ బ్యాక్టీరియాపై ‘సెఫ్ట్రియాక్సోన్’ (Ceftriaxone) అనే మందు పనితీరును వివిధ స్థాయి ఆసుపత్రుల్లో పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
పెద్ద ఆసుపత్రులు (కేటగిరీ-1).. 39.8 శాతం ప్రభావం.
మధ్యస్థ ఆసుపత్రులు (కేటగిరీ-2).. 28 శాతం ప్రభావం.
చిన్న ఆసుపత్రులు (కేటగిరీ-3).. కేవలం 11.5 శాతం మాత్రమే ప్రభావం.
నిర్లక్ష్యం వీడండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..
నవంబరు 18న ప్రారంభమైన ‘ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాల’ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వైద్యుల చీటీ లేకుండా మందుల షాపుల్లో ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ కొనుగోలు చేయడం, అవసరం లేకపోయినా వాటిని వాడటమే ఈ ఆరోగ్య సంక్షోభానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది. చిన్నపాటి జలుబు, దగ్గుకు సొంత వైద్యం మాని, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
