Can Deodorants Cause Breast Cancer : డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ వస్తుందా..?.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా మహిళలను అత్యంత భయాందోళ నలకు గురిచేస్తున్న వ్యాధుల్లో ముందు వరుసలో ఉండేది 'రొమ్ము క్యాన్సర్' (Breast Cancer). ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రతి ఏడాదీ దాదాపు 23 లక్షల నుంచి 24 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా.. సుమారు 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధిని తొలిదశలో గుర్తించకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణం. అయితే, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. రోజూ వాడే డియోడరెంట్లు (Deodorants), యాంటీ పెర్స్పిరెంట్స్ అంటే చెమటను నిరోధించే స్ప్రేలు వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలు రీల్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత..? మహిళలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..!
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఏంటి ఆ ప్రచారం..?
యాంటీ-పెర్స్పిరెంట్స్ను చంకల్లో అప్లై చేయడం వల్ల అవి చెమటను బయటకు రానివ్వకుండా అడ్డుకుంటాయని, తద్వారా శరీర రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన 'లింఫ్ నోడ్స్' అంటే శోషరస గ్రంథులు బ్లాక్ అవుతాయని సోషల్ మీడియాలో చెబుతున్నారు. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు (Toxins) బయటకు పోలేక రొమ్ములో పేరుకుపోయి, క్యాన్సర్‌కు దారితీస్తాయని ఆ ప్రచారం సారాంశం.
వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
ఈ ప్రచారాన్ని ప్రముఖ ఆంకాలజిస్టులు పూర్తిగా కొట్టిపారేశారు. "రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో మొదలవుతుంది కానీ, లింఫ్ నోడ్స్లో కాదు. శోషరస గ్రంథులు బ్లాక్ అయితే ఆ భాగంలో వాపు అంటే లింఫెడెమా వస్తుందే తప్ప, అది క్యాన్సర్‌గా మారుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు" అని వారు స్పష్టం చేస్తున్నారు.
గత 20 ఏళ్లలో 800 నుంచి 7,000 మందికి పైగా మహిళలపై చేసిన ఎన్నో పరిశోధనలు కూడా ఈ విషయాన్నే తేల్చిచెప్పాయి. డియోడరెంట్లకు, రొమ్ము క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని 'అమెరికన్ క్యాన్సర్ సొసైటీ' సైతం స్పష్టం చేసింది. కాబట్టి సోషల్ మీడియా లో జారిగే ప్రచారాలను, అపోహలను నమ్మాల్సిన పనిలేదు.
మరి క్యాన్సర్‌కు అసలు కారణాలేంటి..?
రొమ్ము క్యాన్సర్ అనేది కేవలం ఒక్క కారణం వల్ల రాదు. దీనివెనుక అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వయసు పెరగడం. కుటుంబంలో తల్లి, లేదా సోదరికి రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉండటం. శరీరంలో జన్యుపరమైన, హార్మోన్ల మార్పులు. శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం, అధిక బరువు. ధూమపానం, మద్యపానం అలవాట్లు.
ముప్పును తగ్గించుకోవడం ఎలా..?
డియోడరెంట్ల వల్ల క్యాన్సర్ రాకపోయినా.. మన జీవనశైలిలోని లోపాల వల్ల వచ్చే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి మహిళలు కింది జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బరువు అదుపులో ఉంచుకోండి..అధిక బరువు క్యాన్సర్‌కు అతిపెద్ద ముప్పు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పాలివ్వడం..పిల్లలకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించవచ్చు.
దురలవాట్లకు దూరం..మద్యం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. స్వీయ పరీక్ష (Self Examination)..రొమ్ములో గడ్డలు ఉన్నట్లు అనిపించినా, చనుమొనల ఆకృతిలో మార్పులు వచ్చినా, నొప్పి ఉన్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే.. వయసుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు (మామోగ్రామ్ తదితర) చేయించుకోవడం ఎంతో ఉత్తమం.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
