Cancer Risk : ఎస్ఎంఏ : చిన్నారుల ప్రాణాలు నిలిపే జన్యు చికిత్సతో క్యాన్సర్ ముప్పు..? ‘జోల్జెన్స్మా’పై అమెరికా ఎఫ్డీఏ దర్యాప్తు..!
సాక్షి లైఫ్ : అరుదైన జన్యుపరమైన కండరాల వ్యాధి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ (SMA) బారినపడిన చిన్నారులకు సంజీవనిగా భావించే ‘జోల్జెన్స్మా’ (Zolgensma) జన్యు చికిత్సపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (US FDA) ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నొవార్టిస్ (Novartis) అభివృద్ధి చేసిన ఈ చికిత్స పొందిన చిన్నారులలో కణితులు (tumors) వెలుగుచూడటం, అందులో రెండు కేసుల్లో చికిత్సతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించడం అంతర్జాతీయంగా వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
అసలేమిటీ వివాదం అంటే..?
కండరాల కదలికలకు కీలకమైన మోటారు న్యూరాన్లు క్షీణించిపోయే ప్రాణాంతక వ్యాధి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’. దీనికి విరుగుడుగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధాల్లో ఒకటైన జోల్జెన్స్మాను 2019లో ఎఫ్డీఏ ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరు వేలకు పైగా చిన్నారులు మొదటి విడత డోసు జన్యు చికిత్సను తీసుకున్నారు.
అయితే, ఈ చికిత్స పొందిన వారిలో దాదాపు తొమ్మిది మంది చిన్నారుల్లో వివిధ రకాల కణితులు ఏర్పడినట్లు నివేదికలు అందాయి. కేంద్ర, నాడీ వ్యవస్థలతో పాటు వెన్నుపాము, మూత్రపిండాల ప్రాంతాల్లో ఈ కణితులు బయటపడ్డాయి. వీటిలో రెండు కేసుల్లో నిర్వహించిన జన్యు విశ్లేషణలో చికిత్స కోసం ఉపయోగించిన వాహక వైరస్ (Viral Vector) నేరుగా రోగి సొంత డీఎన్ఏలోని 'GLI1' జన్యువుతో కలిసిపోయినట్లు (‘insertional oncogenesis’) శాస్త్రవేత్తలు గుర్తించారు. క్యాన్సర్ కణాల అసాధారణ పెరుగుదలకు ఈ మార్పు దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరో కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
ఎఫ్డీఏ, నొవార్టిస్ స్పందన..
ప్రస్తుతానికి ఈ ఔషధ వినియోగాన్ని ఎఫ్డీఏ నిలిపివేయలేదు. ఎస్ఎంఏ వ్యాధి తీవ్రత దృష్ట్యా, ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాహక వైరస్ రోగి డీఎన్ఏలో చేరే సైద్ధాంతిక ప్రమాదం గురించి ముందే సమాచార పత్రాల్లో పొందుపరిచామని నొవార్టిస్ వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నారులలో మరింత దీర్ఘకాలిక పర్యవేక్షణ, హెచ్చరికల మార్గదర్శకాలను సమీక్షించే పనిలో నియంత్రణ సంస్థలు నిమగ్నమయ్యాయి.
తల్లిదండ్రులు ఆందోళన చెందాలా..?
ఈ వార్తలతో చికిత్స తీసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనలకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు. 6,000 మందికి పైగా చికిత్స పొందిన వారిలో కేవలం కొన్ని కేసుల్లోనే ఈ సమస్య కనిపించిందని, అన్ని కణితులు నేరుగా ఈ మందు వల్లే వచ్చాయా లేదా అన్నది పూర్తి విశ్లేషణల తర్వాతే స్పష్టమవుతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే చిన్నారులలో ఏదైనా కొత్త లక్షణాలు లేదా గడ్డలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించి అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
