H5N1 Vaccine : ‘హెచ్5ఎన్1’ వ్యాక్సిన్ : బర్డ్‌ఫ్లూకు చెక్.. భారత్‌లో తొలి స్వదేశీ టీకా ఆవిష్కరణ..!
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగాన్ని వణికిస్తున్న ప్రాణాంతక ‘బర్డ్‌ఫ్లూ’ (Avian Influenza) నియంత్రణలో భారత్ చరిత్రాత్మక ముందడుగు వేసింది. కోళ్లను ఈ వ్యాధి బారి నుంచి కాపాడేందుకు దేశంలోనే తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘హెచ్5ఎన్1’ (H5N1) టీకా అందుబాటు లోకి వచ్చింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం భోపాల్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు. ఇది భారత్ శాస్త్రీయ సామర్థ్యానికి, స్వావలంబనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల..
ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?
సాధారణంగా బర్డ్‌ఫ్లూగా పిలిచే ‘హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా’ (HPAI) కోళ్లు, ఇతర పక్షులకు సోకినప్పుడు మరణాల రేటు దాదాపు 100 శాతం వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వదేశీ టీకా రాక పౌల్ట్రీ రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.
ఈ స్వదేశీ టీకా ప్రత్యేకతలివే..
భోపాల్ సంస్థ రూపకల్పన: పశుపక్ష్యాదుల్లో వ్యాపించే తీవ్రమైన అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భోపాల్‌లోని ‘ఐసీఏఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్’ అంటే జాతీయ అత్యున్నత భద్రతా పశు వ్యాధుల సంస్థ శాస్త్రవేత్తలు ఈ టీకాను అభివృద్ధి చేశారు.
ప్రత్యేక వైరస్ రకంపై గురి..
అత్యంత ప్రమాదకరమైన హెచ్5ఎన్1 వైరస్‌లోని ‘క్లేడ్ 2.3.2.1a’ (Clade 2.3.2.1a) అనే ప్రత్యేక రకాన్ని (స్ట్రెయిన్, అడ్డుకునేలా దేశంలో తయారైన తొలి వ్యాక్సిన్ ఇదే. ‘క్లేడ్’ అంటే జన్యుపరంగా భిన్నమైన లక్షణాలు కలిగిన వైరస్ సమూహం. పౌల్ట్రీ రంగానికి రక్షణ..బర్డ్‌ఫ్లూ వ్యాప్తి వల్ల కోళ్ల పరిశ్రమకు కలిగే భారీ ఆర్థిక నష్టాలను అరికట్టడంలో ఈ టీకా కీలక పాత్ర పోషించనుంది.
మనుషులకూ పొంచి ఉన్న బర్డ్‌ఫ్లూ ముప్పు..!
బర్డ్‌ఫ్లూ ప్రధానంగా పక్షుల ద్వారా వ్యాపించే వ్యాధి అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఇది మనుషులకు, ఇతర జంతువులకు కూడా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో మనిషికి హెచ్5ఎన్1 సోకిన తొలి కేసు 2022 ఏప్రిల్‌లో కొలరాడోలోని ఓ పౌల్ట్రీ కార్మికుడిలో బయటపడింది. అనంతరం 2024 ఏప్రిల్‌లో టెక్సాస్‌లో పాడి ఆవుల నుంచి మనిషికి వైరస్ సోకిన తొలి కేసు నమోదైంది.
ప్రపంచవ్యాప్త గణాంకాలు..
పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) నివేదిక ప్రకారం.. 2003 నుంచి 2026 ఆగస్టు 7 వరకు ప్రపంచంలోని 25 దేశాల్లో మనుషుల్లో మొత్తం 1,002 హెచ్5ఎన్1 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 479 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది పరిస్థితి..ఒక్క 2026లోనే ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో తొమ్మిది బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగుచూడగా, అందులో ఇద్దరు మృతి చెందారు. పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్న ఇలాంటి వైరస్‌లను మూలంలోనే అరికట్టడానికి భారత్ రూపొందించిన ఈ స్వదేశీ టీకా ఎంతో దోహదపడుతుందని వైద్య, పశుసంవర్ధక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
