Ebola Thermal Screening : హైదరాబాద్ లోని ఆర్‌జీఐఏలో ‘ఎబోలా’ థర్మల్ స్క్రీనింగ్ షురూ..!

షేర్ చేయండి:
Ebola Thermal Screening : హైదరాబాద్ లోని ఆర్‌జీఐఏలో ‘ఎబోలా’ థర్మల్ స్క్రీనింగ్ షురూ..!

సాక్షి లైఫ్ : కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అప్రమత్తమైంది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ముందస్తు రక్షణ చర్యగా అంతర్జాతీయ రాకపోకల విభాగంలో ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ (APHO) ప్రత్యేక థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. గురువారం నుంచే ఈ తనిఖీలను అధికారికంగా ప్రారంభించారు.

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఆదేశాల మేరకు ఈ పర్యవేక్షణను ముమ్మరం చేశారు. విమానాశ్రయానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమో ప్రాథమిక దశలోనే గుర్తించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.

ఆ మూడు దేశాల నుంచి వస్తే ప్రత్యేక నిఘా.. 

ముఖ్యంగా ఎబోలా ముప్పు ఎక్కువగా ఉన్న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాల నుండి నేరుగా వచ్చే లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించి హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ వంటి విమానాల్లో ఉగాండా తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్నారని, ప్రతి ఫ్లైట్‌లోనూ కనీసం ఇద్దరు లేదా ముగ్గురు ఇటువంటి హై-రిస్క్ దేశాల నుంచి వస్తున్నట్లు ఏపీహెచ్‌ఓ అధికారి ఒకరు తెలిపారు.

థర్మల్ స్క్రీనింగ్‌లో ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు తేలితే.. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహకారంతో వారిని తక్షణమే ప్రత్యేక రిఫరల్ ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే గురువారం రాత్రి వరకు విమానాశ్రయంలో ఎవరికీ ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం రాలేదని అధికారులు స్పష్టం చేశారు.

ప్రయాణికులకు ఏపీహెచ్‌ఓ కీలక సూచనలు.. 

ఎబోలా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయాణికులు స్వచ్ఛందంగా సహకరించాలని విమానాశ్రయ ఆరోగ్య అధికారులు కోరారు. ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు వెళ్లే ముందే.. తమకు జ్వరం, నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి లేదా అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు ఏవైనా ఉంటే స్వచ్ఛందంగా అక్కడి హెల్త్ డెస్క్‌లో నివేదించాలి.

ప్రత్యక్ష పరిచయం ఉంటే సమాచారమివ్వాలి: ఎబోలా సోకినట్లు అనుమానం ఉన్న లేదా నిర్ధారణ అయిన రోగుల రక్తం, ఇతర శరీర ద్రవాలతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్న ప్రయాణికులు వెంటనే ఏపీహెచ్‌ఓ అధికారులకు ఆ సమాచారాన్ని తెలియజేయాలి.

ఆ 21 రోజులు పర్యవేక్షణ అవసరం..!

"హై-రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికులు.. ఇక్కడికి వచ్చిన 21 రోజులలోపు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా తక్షణమే వైద్య సహాయం పొందాలి. అలాగే తమ ట్రావెల్ హిస్టరీ తప్పనిసరిగా వైద్యులకు వెల్లడించాలని ఎయిర్‌పోర్ట్ ఆరోగ్యశాఖ అధికారులు కోరారు. 

 

 ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.