Suspected Ebola Cases Reported in India : దేశంలో ఎబోలా అనుమానిత కేసులు.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ..!
సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశాల్లో వణికిస్తోన్న ఎబోలా వైరస్ ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిఘా తీవ్రమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కఠినంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రాజస్థాన్‌తో పాటు హైదరాబాద్‌లోనూ అనుమానిత కేసులు వెలుగుచూడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే, దేశంలో ఇప్పటివరకు ఎబోలా ఒక్కరికీ నిర్ధారణ కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
జైపూర్, హైదరాబాద్‌లో ప్రయాణికులకు ఐసోలేషన్..
రాజస్థాన్‌లో ఉగాండా పర్యాటకురాలు..ఉగాండా నుంచి షార్జా మీదుగా జైపూర్ చేరుకున్న ఒక 19 ఏళ్ల యువతికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా ఆమెను జైపూర్‌లోని ఆర్‌యూహెచ్ఎస్ (RUHS) ఆసుపత్రి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆమె రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పంపినట్లు, నివేదికలు వస్తేనే పూర్తి స్పష్టత వస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ గుప్తా తెలిపారు.
శంషాబాద్‌లో సూడాన్ జాతీయుడికి స్క్రీనింగ్..
గురువారం ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక సూడాన్ పౌరుడికి థర్మల్ స్క్రీనింగ్‌లో జ్వరం ఉన్నట్లు తేలింది. తక్షణమే స్పందించిన అధికారులు అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి జ్వరం తగ్గడంతో, వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉంచారు.అంతకుముందు బెంగళూరు, గుజరాత్‌లలోనూ ఇలాంటి అనుమానిత కేసులు వెలుగుచూసినా, ఎక్కడా వైరస్ నిర్ధారణ కాలేదు.
ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం..
దేశంలో ప్రస్తుతం ఎబోలా పాజిటివ్ కేసులు ఏవీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. కాంగో, ఉగాండా వంటి దేశాల నుంచి వచ్చేవారు కనీసం 21 రోజుల పాటు తమ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనించుకోవాలని సూచించింది. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వ 24x7 హెల్ప్‌లైన్ నంబర్ 1075ను సంప్రదించవచ్చని పేర్కొంది.
ప్రస్తుతం కాంగో, ఉగాండాలలో 'బండిబుగ్యో' అనే అరుదైన వైరస్ జాతి వ్యాప్తి చెందుతోంది. అక్కడ వందలాది కేసులు నమోదు కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయంగా నిఘా పెంచాలని సూచించింది.
ఎబోలా లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఈ వైరస్ బారిన పడితే ప్రారంభంలో సాధారణ ఫ్లూ తరహా లక్షణాలే కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
తీవ్రమైన జ్వరం, తలనొప్పి
కండరాల నొప్పులు, విపరీతమైన అలసట
వాంతులు, విరేచనాలు
ముదిరితే అంతర్గత రక్తస్రావం, అవయవాల వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడటానికి 2 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. ఈ లోపు సదరు వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారు ఐసోలేషన్‌లో ఉండటం ఎంతో శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
