Muscular Dystrophy: చిన్నారుల్లో కండరాల క్షీణతకు కారణాలేంటి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నడవడం, కూర్చోవడం, చేతులు పైకెత్తడం.. ఇవన్నీ మన శరీరంలోని కండరాల సహకారంతోనే సాధ్యమవుతాయి. అలాంటి కండర వ్యవస్థే కాలక్రమేణా శక్తిహీనమైతే ఆ జీవన ప్రయాణం ఎంతటి నరకంగా మారుతుందో ఊహించలేం. వైద్య పరిభాషలో ఈ రుగ్మతను మస్కులర్ డిస్ట్రోఫీ (Muscular Dystrophy) లేదా కండర క్షీణత అని పిలుస్తారు. ప్రధానంగా వంశపారంపర్య, జన్యుపరమైన కారణాలతో బాల్యం నుంచే మొదలయ్యే ఈ సమస్యపై తల్లిదండ్రులు తగినంత అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.

కండర బలం తగ్గడానికి మూలమేంటి..?

కండర కణజాలం దృఢంగా, ఆరోగ్యంగా పనిచేయడానికి డిస్ట్రోఫిన్ (Dystrophin) అనే ప్రత్యేక ప్రొటీన్ అవసరం. మన శరీరంలోని నిర్దిష్ట జన్యువుల్లో లోపాలు (genetic mutations) ఏర్పడినప్పుడు ఈ ప్రొటీన్ ఉత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. దీనివల్ల కండర కణాలు క్రమంగా బలహీనపడి, ఒకదాని తర్వాత ఒకటి నశించిపోతాయి. పురుషుల్లో ఈ జన్యు సంబంధ సమస్యలు ఎక్కువగా బయటపడుతుంటాయి.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

 

సాధారణంగా కనిపించే రకాలు..

ఈ రుగ్మతలో అనేక రకాలు ఉన్నప్పటికీ, వైద్యులు తరచూ గమనించే కొన్ని ప్రధాన విభాగాలు.. డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD).. అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదకర రూపం. దాదాపు 2 నుంచి 5 ఏళ్ల వయస్సులోనే లక్షణాలు బయటపడతాయి. సమయానికి వైద్య పర్యవేక్షణ లేకపోతే 10 నుంచి 12 ఏళ్లు వచ్చేసరికి నడవడం కష్టతరమై వీల్‌చైర్‌పై ఆధారపడాల్సి వస్తుంది.

బెకర్ మస్కులర్ డిస్ట్రోఫీ (BMD).. డీఎండీతో పోలిస్తే దీని తీవ్రత కాస్త తక్కువ. లక్షణాలు యుక్తవయస్సు లేదా కౌమార దశలో కనిపిస్తాయి, కండరాల క్షీణత నెమ్మదిగా సాగుతుంది. మయోటోనిక్ డిస్ట్రోఫీ.. పెద్దవారిలో తరచూ కనిపించే రకం. ఇందులో ఒకసారి సంకోచించిన కండరాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది, బిగుసుకుపోతాయి.

తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు..

పిల్లల్లో సాధారణ పెరుగుదల మైలురాళ్లు ఆలస్యమవుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా కింది అంశాలను నిశితంగా పరిశీలించాలి:

నడక శైలిలో మార్పు..సరిగ్గా అడుగులు వేయలేకపోవడం, బాతులాగా అటూఇటూ ఊగుతూ నడవడం లేదా ఎప్పుడూ కాలి వేళ్లపైనే నడిచే ప్రయత్నం చేయడం.కూర్చొని లేవడానికి శ్రమించడం..నేలపై కూర్చున్న చిన్నారి లేచే సమయంలో తన చేతులను నేరుగా కాళ్లు, మోకాళ్లపై ఆనించి నెమ్మదిగా పైకి లేవడం దీనిని వైద్యంలో 'గోవర్స్ సైన్' అంటారు.

పదే పదే తూలి పడటం..సమవయస్కులైన పిల్లల్లా పరుగెత్తలేకపోవ డం, మెట్లు ఎక్కేటప్పుడు తీవ్రంగా ఆయాసపడటం. పిక్కలు లావుగా మారడం: పిక్క కండరాలు సాధారణం కంటే లావుగా కనిపించినా, అది బలం వల్ల కాదు; లోపల కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే మార్పు. శ్వాస, గుండె సమస్యలు: వ్యాధి ముదిరే కొద్దీ గుండె కండరాలు, శ్వాస వ్యవస్థ బలహీనపడి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.

నిర్ధారణ పరీక్షలు,చికిత్స మార్గాలు..

రక్తంలో క్రియేటిన్ కైనేస్ (CK) ఎంజైమ్ స్థాయిలను కొలవడం, ఎలక్ట్రోమయోగ్రఫీ (EMG)తో పాటు అధునాతన జన్యు పరీక్షల (Genetic Testing) ద్వారా ఏ రకమైన మ్యుటేషన్ ఉందో కచ్చితంగా గుర్తిస్తారు. ప్రస్తుతానికి ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే చికిత్స లేనప్పటికీ, సమస్య వేగాన్ని మందగింపజేసేందుకు ఆధునిక వైద్యం పలు పరిష్కారాలను చూపుతోంది:

నిరంతర ఫిజియోథెరపీ..కీళ్లు బిగుసుకుపోకుండా, శరీర కదలికలు నిలిచిపోకుండా ఉండేందుకు నిపుణుల సమక్షంలో రోజూ ప్రత్యేక వ్యాయామాలు చేయించాలి. కార్టికోస్టెరాయిడ్స్..కండరాల బలం వేగంగా క్షీణించకుండా ఉండేందుకు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల మందులు తోడ్పడతాయి. సహాయక సాధనాలు..ఆర్థోటిక్ బ్రేసెస్, వాకర్లు, చక్రాల కుర్చీల సాయంతో పిల్లలు ఇతరులపై ఆధారపడకుండా కదలడానికి వీలవుతుంది.

జీన్ థెరపీ పురోగతి..జన్యు లోపాలను సరిచేసే ఆధునిక జీన్ థెరపీ ( micro-dystrophin treatments), ఎక్సాన్ స్కిప్పింగ్ మందులు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి వస్తూ కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. చిన్నతనంలో పిల్లలు తరచూ కిందపడిపో తున్నా లేదా నడవడానికి విముఖత చూపుతున్నా దానిని కేవలం బద్ధకం లేదా సాధారణ అలసటగా కొట్టిపారేయ కూడదు. సకాలంలో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయిస్తే వ్యాధి తీవ్రతను ఆలస్యం చేస్తూ, వారి జీవితాన్ని సాధ్యమైనంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దవచ్చు.

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.