Belly Fat May Reduce Memory Power : పొట్ట చుట్టూ ఉండే కొవ్వు.. జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది..! కొత్త పరిశోధనలో షాకింగ్ నిజాలు..
సాక్షి లైఫ్ : పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును చాలా మంది కేవలం శారీరక ఆకృతి, ఫిట్‌నెస్‌కు సంబంధించిన సమస్యగానే చూస్తుంటారు. బరువు తగ్గితే అందంగా కనిపిస్తామనే ఆలోచనతోనే వ్యాయామాలు చేస్తుంటారు. అయితే, పొట్ట కొవ్వు కేవలం శరీర సౌందర్యాన్నే కాదు.. మీ మెదడు ఆరోగ్యాన్ని, దాని ఆయుష్షును కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మధ్య వయస్సులో పొట్ట దగ్గర కొవ్వు తక్కువగా ఉన్నవారిలో మెదడు వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
16 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ అధ్యయనంలో..
ప్రముఖ అంతర్జాతీయ శాస్త్ర విజ్ఞాన పత్రిక 'నేచర్ కమ్యూనికేషన్స్' (Nature Communications) లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. పొట్టలోని అంతర్గత కొవ్వుకు (Visceral Fat), మెదడు వృద్ధాప్యానికి, జ్ఞాపకశక్తి క్షీణతకు మధ్య ఉన్న సంబంధాన్ని అత్యంత ఆధునిక ఎంఆర్ఐ (MRI) సాంకేతికత ద్వారా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ అధ్యయనంలో భాగంగా సుమారు 533 మంది మధ్య వయస్కులైన స్త్రీ, పురుషుల ఆరోగ్యాన్ని దాదాపు 16 సంవత్సరాల పాటు నిశితంగా పర్యవేక్షించారు. ఈ సుదీర్ఘ కాలంలో వారి పొట్ట, మెదడు భాగాలకు క్రమంతప్పకుండా ఎంఆర్ఐ స్కాన్లు నిర్వహించడమే కాకుండా.. వారి ఆలోచనా విధానాన్ని, మేధో సామర్థ్యాలను నిరంతరం అంచనా వేశారు.
ఈ పరిశోధనలో పొట్ట చుట్టూ కొవ్వు తక్కువగా ఉన్నవారిలో మెదడు కణజాలం (Brain Tissue) క్షీణించే వేగం చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే, పొట్ట కొవ్వును అదుపులో ఉంచుకోవడం వల్ల మెదడులోని కీలక నిర్మాణాలు సురక్షితంగా ఉండి, వయసు పైబడినా గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి స్థిరంగా ఉంటాయని తేలింది.
పొట్టకు.. మెదడుకు సంబంధం ఏంటి..?
పొట్టలో పేరుకునే కొవ్వుకు, తలలో ఉండే మెదడుకు లంకె ఎక్కడ ఉందనే సందేహం రావడం సహజం. శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ (Glucose Regulation), ఇన్సులిన్ సున్నితత్వం (Insulin Sensitivity) అనే రెండు అంశాలే ఈ రెండింటికీ మధ్య వారధిగా పనిచేస్తున్నాయని పరిశోధన ఆధారాలు చూపుతున్నాయి. పొట్టలో అంతర్గత కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు అది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇది పరోక్షంగా మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రధాన పరిశోధకురాలు ఐరిస్ షాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్య వయస్సు నుంచే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటూ, పొత్తికడుపులోని కొవ్వును తగ్గించుకోవడం ప్రతి ఒక్కరూ సులభంగా సాధించదగిన లక్ష్యమే. ఇలా చేయడం ద్వారా వయసుతో పాటు వచ్చే మెదడు క్షీణతను, భవిష్యత్తులో తలెత్తే డిమెన్షియా వంటి తీవ్ర మానసిక సమస్యల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.
మెదడును యవ్వనంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి..?
పొట్ట కొవ్వును కరిగించి, మెదడు పనితీరును మెరుగుపరుచు కోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. అవేంటంటే..?
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌ను వీలైనంత దూరంగా పెట్టాలి. పీచు పదార్థాలు (ఫైబర్), పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట కొవ్వు వేగంగా కరుగుతుంది.
మితిమీరిన మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో 'కోర్టిసోల్' అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి కారణమవు తుంది. కాబట్టి యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. పొట్ట చుట్టూ అసాధారణంగా కొవ్వు పెరుగుతున్నట్లు అనిపిస్తే, కేవలం బరువు తగ్గడం కోసమే కాకుండా భవిష్యత్తులో రాబోయే మేధోపరమైన సమస్యల నుంచి తలదించుకోవడానికి తగిన వైద్య నిపుణుల లేదా డైటీషియన్ల సలహాతో సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
