Stress : ఒత్తిడితో పదే పదే జుట్టు పీక్కుంటున్నారా..? కారణాలివే కావచ్చు..!
సాక్షి లైఫ్ : కొంతమంది ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పుడు లేదా ఖాళీగా కూర్చున్నప్పుడు తమకు తెలియకుండానే జుట్టు పీక్కుంటుంటారు. ఈ అలవాటు క్రమంగా పెరిగిపోయి, చేతులను నియంత్రించుకోలేని స్థితికి చేరుకుంటే.. వైద్య పరిభాషలో దానిని 'ట్రైకోటిల్లోమేనియా' (Trichotillomania) అంటారు. ఇదొక మానసిక, ప్రవర్తనా సంబంధిత సమస్య. జుట్టు లాక్కోవడం వల్ల వారికి తాత్కాలికంగా ఉపశమనం లభించినా, అది క్రమంగా తీవ్రమైన ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ అలవాటు ఎందుకు పెరుగుతుందో, దీనికి దారితీసే ప్రధాన కారణాలేమిటో చూద్దాం..
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఈ అలవాటు పెరగడానికి ప్రధాన కారణాలు..
1. మానసిక ఒత్తిడి..
ఆఫీసులో పని భారం, కుటుంబ సమస్యలు లేదా మరేదైనా విషయం గురించి నిరంతరం ఆలోచించడం వల్ల మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో కొందరు అసంకల్పితంగా తమ జుట్టును తామే పీక్కుంటారు. చాలాసార్లు తాము ఏం చేస్తున్నామన్న స్పృహ కూడా వారికి ఉండదు.
2. ఆందోళన, భయం..
మనసులో నిరంతరం తెలియని ఆందోళన (Anxiety) గూడుకట్టుకుని ఉన్నప్పుడు ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు లాక్కోవడం వల్ల వారికి ఆ క్షణానికి కాస్త ప్రశాంతంగా, సురక్షితంగా అనిపించ వచ్చు. కానీ ఆ ఉపశమనం తాత్కాలికమే. ఆ తర్వాత మళ్లీ అదే భావన కలుగుతుంది.
3. ఖాళీ సమయాల్లో అప్రయత్నంగా..
కొందరు టీవీ చూస్తున్నప్పుడు, మొబైల్ వాడుతున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు లేదా దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు చేతులు అప్రయత్నంగా జుట్టు దగ్గరకు వెళ్తాయి. ఇలా జుట్టుతో ఆడుకోవడం క్రమంగా లాక్కోవడం, పీక్కోవడం వరకు దారితీస్తుంది.
4. భావోద్వేగాల అసమతుల్యత..
కోపం, విచారం, ఒంటరితనం లేదా తీవ్రమైన నిరాశ లాంటి భావోద్వేగాలను అదుపు చేసుకోలేనప్పుడు.. కొందరు ఇలాంటి ప్రవర్తనకు అలవాటు పడతారు. శారీరకమైన ఈ చర్య ద్వారా తమ మానసిక బాధను, కోపాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటారు.
5. నియంత్రించుకోలేని కోరిక (Compulsive Behavior)..
ఏదైనా ఒక పనిని పదే పదే చేస్తే అది వ్యసనంగా మారుతుంది. ట్రైకోటిల్లోమేనియా కూడా అంతే. మానుకోవాలని ఎంత ప్రయత్నించినా.. ఆ కోరికను అదుపు చేసుకోలేక పదే పదే జుట్టు పీక్కుంటుంటారు. దీన్ని ఆపడం వారికి క్రమంగా కష్టంగా మారుతుంది.
సమస్య తీవ్రంగా ఉందని ఎలా గుర్తించాలి..?
తల, కనుబొమ్మలు లేదా కనురెప్పల వద్ద జుట్టు పలచబడటం లేదా పూర్తిగా ఊడిపోయి మచ్చలుగా ఏర్పడటం. జుట్టు పీక్కోవడాన్ని ఆపుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవ్వడం. జుట్టు పలచబడటం వల్ల నలుగురిలోకి వెళ్లడానికి సిగ్గుపడటం, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం.
నిపుణుల సాయం తప్పనిసరి..
జుట్టు పీక్కోవడం కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు. దీని వెనుక అనేక మానసిక కారణాలు ఉంటాయి. ఈ అలవాటును మీ సంకల్ప శక్తి (Willpower) లోపంగా భావించి మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. సమస్యను గుర్తించిన వెంటనే సైకియాట్రిస్ట్ లేదా థెరపిస్ట్ సంప్రదించడం ద్వారా 'హాబిట్ రివర్సల్ ట్రైనింగ్', సీబీటీ (CBT) వంటి థెరపీలతో ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడొచ్చు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
