Chronic Stress : నిరంతర ఒత్తిడితో శరీరంలో దెబ్బతినే ప్రధాన అవయవాలివే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇప్పుడున్న ఉరుకులు పరుగుల లైఫ్ స్టైల్లో ఒత్తిడి (stress) అనేది సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. ఆఫీసు పని భారం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై ఆందోళన వంటివి మనిషిని నిరంతరం ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చాలామంది ఒత్తిడిని కేవలం ఒక మానసిక సమస్యగా మాత్రమే భావిస్తుంటారు. కానీ, ఇది మన శరీరంలోని పలు కీలక అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు సామర్థ్యం, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ దెబ్బతింటాయి. ఫలితంగా తలనొప్పి, నిద్రలేమి, అధిక రక్తపోటు (bp), కడుపునొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు వేధిస్తాయి. అసలు ఒత్తిడి శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది..? ఏయే అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

1. మెదడు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం..

మనం ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో 'కార్టిసాల్', 'అడ్రినలిన్' అనే హార్మోన్లు విడుదలవుతాయి. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇవి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. అయితే, ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే మెదడు పనితీరు మందగిస్తుంది. నిరంతర ఒత్తిడి వల్ల విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి తగ్గిపోతాయి. ఏ పనిపైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోవడం జరుగు తుంది. మనసులో ఆందోళన, అశాంతి వల్ల రాత్రిపూట కంటినిండా నిద్రపట్టదు. చిన్నచిన్న విషయాలకే విపరీతమైన కోపం రావడం, మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన ఆందోళన సమస్యలకు దారితీస్తుంది.

2. గుండె ఆరోగ్యానికి ముప్పు..  

ఎల్లప్పుడూ ఆందోళనతో ఉండటం వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్ల స్థాయి పెరిగి, రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి సమయంలో రక్తపోటు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. భయం లేదా ఆందోళన కలిగినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం గమనించ వచ్చు.

 ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కొందరు అతిగా తినడం, ధూమపానం చేయడం, శారీరక శ్రమ తగ్గించడం వంటివి చేస్తారు. ఇవన్నీ కలిసి భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

3. జీర్ణవ్యవస్థపై తీవ్ర దెబ్బ..  

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కడుపునొప్పి, గ్యాస్ లేదా ఎసిడిటీ రావడాన్ని మీరెప్పుడైనా గమనించారా..? మన మెదడుకు, పొట్టకు మధ్య అత్యంత బలమైన సంబంధం ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో 'గట్-బ్రెయిన్ కనెక్షన్' అంటారు. ఒత్తిడి ఈ సమతుల్యతను దెబ్బతీసి జీర్ణ సమస్యలను పెంచుతుంది.
ఒత్తిడి వల్ల కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ పెరిగి ఛాతీలో మంటగా అనిపిస్తుంది. పేగుల సున్నితత్వం పెరిగి కడుపులో పట్టేసినట్లు నొప్పి వస్తుంది.
  
జీర్ణక్రియ వేగంలో మార్పులు రావడం వల్ల మలబద్ధకం లేదా విరేచనాల సమస్య తలెత్తుతుంది. కొందరు ఒత్తిడిలో ఉన్నప్పుడు విపరీతంగా తింటే, మరికొందరికి అసలు ఆకలి వేయదు. అలాగే 'ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్' (IBS) ఉన్నవారిలో లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.

ఒత్తిడిని జయించడానికి సులభమైన మార్గాలు..

జీవనశైలిలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోవచ్చు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోయేలా చూసుకోవాలి. రోజూ కాసేపు ధ్యానం చేయడం, లోతుగా శ్వాస తీసుకుని వదలడం వల్ల మనసు ప్రశాంతపడుతుంది.

తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవాలి.  రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. మీ సమస్యలను, బాధలను కుటుంబ సభ్యులు లేదా ఆప్తమిత్రులతో పంచుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. గంటల తరబడి ఏకధాటిగా పనిచేయకుండా, మధ్యమధ్యలో చిన్నచిన్న విరామాలు తీసుకుంటూ విశ్రాంతి పొందాలి.

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.