Bad habit : టీతో పాటు సిగరెట్ తాగడంవల్ల ఒత్తిడి తగ్గుతుందనుకుంటే పొరపాటే.. అది ప్రాణాంతకం: వైద్యనిపుణులు హెచ్చరిక..!
సాక్షి లైఫ్ : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మందికి ‘టీ’ తాగడం ఒక నిత్యకృత్యం. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువత ఆఫీసుల్లో పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కోసం రోజుకు నాలుగైదు సార్లు టీ బ్రేక్ తీసుకుంటుంటారు. అయితే, ఈ మధ్యకాలంలో యువతలో ఒక ప్రమాదకరమైన ధోరణి పెరుగుతోంది. టీ తాగుతూ.. చేతిలో సిగరెట్ వెలిగించడం ఒక ఫ్యాషన్‌గా, అలవాటుగా మార్చుకుంటున్నారు. ఈ రెండు కలయికల వల్ల శరీరానికి జరిగే తీవ్ర నష్టంపై ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆఫీసుల్లో చిన్న విరామం దొరికినా, స్నేహితులతో బయటకు వెళ్లినా టీ-సిగరెట్ కాంబినేషన్‌ను ఆస్వాదించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే ఈ అలవాటు, ఆ తర్వాత శరీరానికి ఎంతటి ముప్పుగా మారుతుందో శాస్త్రీయ కారణాలతో సహా నిపుణులు వివరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
గుండెపై తీవ్ర ఒత్తిడి..
సిగరెట్లలో ఉండే ‘నికోటిన్’ గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును ఒక్కసారిగా పెంచుతుంది. మరోవైపు టీలో ఉండే ‘కెఫీన్’ కూడా కేంద్ర నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఈ రెండూ ఒకేసారి శరీరంలోకి చేరినప్పుడు గుండెపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో అధిక రక్తపోటు (BP)తో పాటు గుండెపోటు (heart attack) వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఊపిరితిత్తులు గుల్ల..
సిగరెట్ నుంచి వచ్చే పొగ నేరుగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. శ్వాసనాళాల్లో వాపును కలిగించి, రక్తంలో ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. టీ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపకపోయినప్పటికీ.. టీ తాగే సాకుతో సిగరెట్ల సంఖ్య పెరగడం వల్ల ఊపిరితిత్తులు మరింత వేగంగా పాడవుతాయి.
జీర్ణవ్యవస్థ అతలాకుతలం..
చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా ఆఫీసుల్లో ఆకలిగా ఉన్నప్పుడు టీ, సిగరెట్లను తీసుకుంటారు. ఇది కడుపులో తీవ్రమైన యాసిడ్ల ఉత్పత్తికి దారితీస్తుంది. ఫలితంగా తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది జీర్ణాశయ లోపలి పొరను దెబ్బతీస్తుంది.
మెదడును లొంగదీసుకునే వ్యసనం..
నికోటిన్, కెఫీన్ రెండూ మెదడుపై రసాయనిక ప్రభావం చూపిస్తాయి. ఇవి శరీరంలో ‘డోపమైన్’ అంటే తాత్కాలికంగా ఆనందాన్నిచ్చే హార్మోన్ ను విడుదల చేస్తాయి. దీంతో టీతో పాటు సిగరెట్ తాగితేనే ఒత్తిడి తగ్గుతుందనే తప్పుడు సంకేతం మెదడుకు వెళ్తుంది.
తాత్కాలిక ఉపశమనం.. దీర్ఘకాలిక నష్టం..!
"టీ, సిగరెట్ కలయిక వల్ల కలిగే ఉపశమనం కేవలం తాత్కాలికం మాత్రమే. శరీరంలో నికోటిన్, కెఫీన్ ప్రభావం తగ్గగానే మళ్లీ తీవ్రమైన చంచలత్వం, చిరాకు, మానసిక ఆందోళన పెరుగుతాయి. ఇది క్రమంగా మనిషిని ఆ అలవాటుకు బానిసగా మారుస్తుందని ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడైనా మించిపోయింది లేదు..!
ఒత్తిడిని దూరం చేసుకోవడానికి టీ, సిగరెట్లపై ఆధారపడటం మానేసి.. తగినంత నీరు తాగడం, చిన్నపాటి నడక, యోగా లేదా ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, కాబట్టి ఈ రోజే ఈ ప్రమాదకరమైన అలవాటుకు గుడ్‌బై చెప్పండి..!
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
