Mental health care : బాధలో ఉన్నప్పుడు పాత చాట్లు చూస్తున్నారా..? నిపుణులు ఏమంటున్నారంటే..?
సాక్షి లైఫ్ : మనసు కాస్త విచారంగా ఉన్నప్పుడో.. లేదా మనకు అత్యంత ఆప్తులైన వారి జ్ఞాపకాలు చుట్టుముట్టినప్పుడో.. మనకు తెలియకుండానే చేతులు ఫోన్ వైపు వెళ్తుంటాయి. వేళ్లు వాటంతట అవే వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లోని ఓల్డ్ చాట్స్ ను వెతకడం ప్రారంభిస్తాయి. నేటి డిజిటల్ కాలంలో చాలా మందిలో ఇదొక సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, దీని వెనుక కేవలం అలవాటు మాత్రమే లేదు, బలమైన మానసిక కారణాలు కూడా ఉన్నాయని క్లినికల్ సైకాలజిస్టులు వివరిస్తున్నారు. మన మెదడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో.. దీని వల్ల కలిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
పాత సంభాషణల్లోనే ఆ ఓదార్పు ఎందుకు..?
మానసిక ఒత్తిడి లేదా భావోద్వేగ పరంగా బలహీనంగా ఉన్నప్పుడు, మనస్సు ఎల్లప్పుడూ సురక్షితమైన వాతావరణాన్ని కోరుకుంటుంది. గతంలో ఎప్పుడైనా ప్రేమ, ఆప్యాయత, భద్రత లభించిన క్షణాల్లోకి మెదడు ప్రయాణిస్తుంది.మానవ మెదడులో జ్ఞాపకాలు, భావోద్వేగాలు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉంటాయి. పాత సందేశాలను చదువుతున్నప్పుడు, ఆనాటి మధుర క్షణాలకు సంబంధించిన జ్ఞాపకాలు మెదడులో మళ్లీ సజీవమవుతాయి.
డోపమైన్ ప్రభావం: పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వల్ల మెదడులోని ‘రివార్డ్ పాత్‌వేస్’ ఉత్తేజితమవుతాయి. ఇది ‘డోపమైన్’ వంటి సంతోషాన్నిచ్చే రసాయనాల విడుదలకు కారణమవుతుంది. ఫలితంగా తాత్కాలికంగానైనా మానసిక ఓదార్పు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బంధాలు తెగిపోయినప్పుడు మరింత ఎక్కువ..
ముఖ్యంగా ప్రేమ బంధాలు విడిపోయినప్పుడు లేదా మనస్పర్థలతో దూరమైనప్పుడు పాత చాట్లను చదివే అలవాటు వ్యసనంగా మారే ప్రమాదం ఉందని సంబంధాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకస్మికంగా దూరం కావడాన్ని మెదడు అంత సులభంగా అంగీకరించకపోవడమే దీనికి ప్రధాన కారణం. బంధం ముగిసిపోయినా, పాత సంభాషణల ద్వారా ఆ క్షణాలను పట్టుకుని వేలాడటానికి ప్రయత్నిస్తుంటారు.
అసలు ఎక్కడ తప్పు జరిగింది..? బంధం ఎందుకు బలహీనపడింది..? అనే విషయాలను అర్థం చేసుకోవడానికి, ఆ సందేశాలలో దాగి ఉన్న సంకేతాలను వెతకడానికి ప్రయత్నిస్తారు. ఓల్డ్ చాట్స్ ను చదివేటప్పుడు వాళ్లు కేవలం అక్షరాలను మాత్రమే చదవడం లేదు, ఆయా సమయాల్లో అనుభవించిన భావాలను మళ్లీ మళ్లీ అనుభవిస్తుంటారు. ఇది తాత్కాలికంగా బాగున్నా.. జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుకుంటుంది.
డిజిటల్ యుగంలో నెమ్మదిస్తున్న గాయం..!
పూర్వ కాలంలో పాత జ్ఞాపకాలు కాలక్రమేణా మసకబారేవి. కానీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో గతం ఎప్పటికీ చెరిగిపోకుండా నిలిచిపోతోంది. పాత మెసేజ్‌లు, ఫొటోలు, వాయిస్ నోట్స్ అన్నీ ఒక క్లిక్ దూరంలోనే అందుబాటులో ఉంటున్నాయి. ఈ జ్ఞాపకాలను పదేపదే తిరగేయడం వల్ల మానసిక గాయాలు మానడానికి చాలా సమయం పడుతోంది.
ఈ అలవాటు ప్రమాదకరమని చెప్పే హెచ్చరికలు..
పరిమితంగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం సహజమే అయినా, కొన్నిరకాల లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలని సైకాలజిస్టులు అంటున్నారు.
నిరంతరం గతం గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేయడం.
పదేపదే ఫోన్ స్క్రీన్ చూసుకోవాలనే బలమైన కోరిక కలగడం.
ప్రస్తుత స్నేహితులకు, కుటుంబ సభ్యులకు క్రమంగా దూరమవ్వడం.
పాత చాట్లు చదివిన తర్వాత బాధ తగ్గడానికి బదులు మరింత పెరగడం.
ఈ అలవాటు వల్ల నిద్ర లేమి, రోజువారీ పనులు, మానసిక స్థితి దెబ్బతినడం.
ఇటువంటి లక్షణాలు నిరంతరం వేధిస్తుంటే అది మానసిక ఒత్తిడి, ఆందోళన (యాంగ్జైటీ), లేదా డిప్రెషన్‌కు సంకేతం కావచ్చు. ఇలాంటి సమయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
అధిగమించేందుకు మార్గాలు..
గతాన్ని తలుచుకుంటూ సమయాన్ని వృథా చేయడం కంటే, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ చర్యలు ఉపయోగ పడతాయి. ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఎక్కువ సమయం గడపాలి. నిరంతరం ఏదో ఒక వ్యాయామం, యోగా లేదా నచ్చిన క్రీడల్లో పాల్గొనడం ద్వారా మెదడు చురుగ్గా మారుతుంది.
మనసులోని ఆలోచనలను ఒక డైరీలో రాసిపెట్టుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. అవసరమైతే ఏమాత్రం సంకోచించ కుండా కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్‌ను సంప్రదించి సహాయం పొందాలి. గతాన్ని గౌరవించడం మంచిదే, కానీ మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ జీవితంలో ముందుకు సాగాలంటే వర్తమానంలో జీవించడం, కొత్త అనుభవాలను ఆహ్వానించడం ఎంతో ముఖ్యం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
